అక్షరటుడే, కామారెడ్డి: Chit Fund Dispute | తనకు రావాల్సిన చిట్టి డబ్బులను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఓ బాధితుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. కామారెడ్డి(Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Chit Fund Dispute | బీబీపేట మండలం..
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన సుక్కన్నగారి సంతోష్ కుమార్ ప్రస్తుతం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఉంటున్నాడు. గతంలో ఉన్న పరిచయాలతో అడ్లూర్ గ్రామానికి చెందిన బాలూరి ప్రతాప్ వద్ద రూ.5 లక్షల చిట్టి వేశాడు. మూడు నెలలకు ఒకసారి రూ.35 వేల చొప్పున 12సార్లు చెల్లింపులు చేశాడు. చిట్టి చివరిలో రూ.5 లక్షలు రావాల్సి ఉండగా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు. సదరు చిట్టి ఇచ్చే వ్యక్తి ప్రతాప్ అప్పుడప్పుడు కలిపి రూ.70వేల వరకు మాత్రమే చెల్లించాడని, మిగతా రూ.4.30 లక్షలు ఇంకా రావాల్సి ఉందని సంతోష్ కుమార్ తెలిపాడు. 18 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో గత ఆగస్ట్ 3న చిట్టి డబ్బుల కోసం ప్రతాప్ ఇంటికి వెళ్లి అడిగితే ఇవ్వలేదని, చెక్కులు ఇవ్వాలని కోరినా ఇవ్వనని చెప్పాడని సంతోష్ కుమార్ తెలిపాడు. అప్పుడే ఆత్మహత్యాయత్నం చేస్తే తనను కట్టేసి కొట్టాడని ఆరోపించారు.
Chit Fund Dispute | పోలీసులు పట్టించుకోలేదని..
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తిరిగినా పట్టించుకోలేదని సంతోష్ చెప్పాడు. పలువురు ద్వారా ఫోన్ చేయిస్తే సెప్టెంబర్ 9న ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి, ఇటీవల లీగల్‌గా చూసుకోవాలని మాట మారుస్తున్నారని ఆరోపించాడు. పోలీసులకు ప్రతాప్ డబ్బుల ఆశ చూపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. 18 నెలలుగా ఫోన్ చేసినా, ఇంటికి వెళ్లినా స్పందించకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో ఈ నెల 8న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించాడు. తాను కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, డబ్బులు వచ్చేదాకా ఆమరణ దీక్ష చేస్తానని సంతోష్ కుమార్ స్పష్టం చేశాడు. పోలీసులు చేరుకుని సంతోష్ కుమార్ ను సముదాయించే ప్రయత్నం చేసినా తనకు రావాల్సిన డబ్బులు ఇక్కడే ఇవ్వాలని, తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పాడు. ఈ విషయమై ప్రతాప్‌ను ఫోన్ ద్వారా వివరణ కోరగా తాను సంతోష్‌కు ఎలాంటి డబ్బులు ఇచ్చేది లేదన్నారు. గతంలో కపిల్ చిట్ ఫండ్స్‌లో చిట్టి వేసినప్పుడు తన డబ్బులు వాడుకున్నాడని, ఫలితంగా చిట్ ఫండ్ నుంచి తనను రిమూవ్ చేస్తే హైదరాబాద్ వెళ్లి సెట్ చేసుకున్నానని తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేందుకే ధర్నాకు దిగాడని, తాను కూడా సంతోష్‌పై పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు.