అక్షరటుడే, వెబ్డెస్క్ : CJP Leaders Bail | కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke)తో పాటు నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది పాటు శాంతికి భంగం కలిగించొద్దని కోర్టు వారికి సూచించింది. ఈ షరతు మేరకు బెయిల్ మంజూరు చేసింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీజేపీ నేతలను పోలీసులు విమానం దిగకముందే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారిని కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. రూ. 50,000 పూచీకత్తుతో, సంవత్సరం పాటు శాంతితో, సత్ప్రవర్తనతో ఉండాలంటూ వారికి సూచించారు.
CJP Leaders Bail | 3 వేల మంది అరెస్ట్..
సీజేపీ ఆందోళన నేపథ్యంలో శనివారం పోలీసులు రాజకీయ నాయకులతో సహా 3,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వారిని విడుదల చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రణాళికతో వ్యవహరించారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీని సైతం రాత్రి విడుదల చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా సీజేపీ నేతలను విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే అరాచకాన్ని సృష్టించడం ఎవరికీ హక్కు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Basara Saraswati Navaratri | విద్యకు వెలుగు.. జ్ఞానానికి జ్యోతి.. గోదావరి తీరాన కొలువైన వాగ్దేవి వైభవం