అక్షరటుడే వెబ్‌డెస్క్: Cognizant Learning Center |ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ, ఏఐ బిల్డర్ కాగ్నిజెంట్ (Cognizant) తన చెన్నై సిరుసేరి క్యాంపస్‌లో ‘కాగ్నిజెంట్ ఇమ్మర్సివ్ లెర్నింగ్ సెంటర్’ (CILC) మొదటి దశను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందించేందుకు అవసరమైన మానవ వనరులను, నైపుణ్యాలను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
Cognizant Learning Center | అధునాతన వసతులు..
భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక కార్యాలయ డిజైన్, డిజిటల్ లెర్నింగ్ మౌలిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని రూపొందించారు. దాదాపు 1,65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో 1,822 సీటింగ్ సామర్థ్యంతో 58 తరగతి గదులు, 208 మల్టీపర్పస్ సీట్లు, కొలాబరేటివ్ స్పేస్‌లు, మీటింగ్ రూమ్‌లు, వర్క్ కేఫ్, లైబ్రరీ , టౌన్ హాల్ వసతులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనిని మరిన్ని దశల్లో విస్తరించనున్నారు.
Cognizant Learning Center | నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
ఈ సందర్భంగా కాగ్నిజెంట్ గ్లోబల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వారియర్ మాట్లాడుతూ.. వ్యాపారాలను ఆధునీకరించేందుకు ఏఐని వినియోగించడంపై, ఆ మార్పుకు నాయకత్వం వహించే నైపుణ్యాలను తమ ఉద్యోగులలో పెంపొందించడంపై దృష్టి సారించామన్నారు. క్లయింట్ల కోసం వినూత్న ఏఐ పరిష్కారాలను రూపొందించడానికి ఉద్యోగులు నేర్చుకుని, కలిసి పనిచేసే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందని తెలిపారు.
Cognizant Learning Center | నిరంతర అభ్యాసమే కీలకం..
టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని కాగ్నిజెంట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ (CPO) కాథీ డియాజ్ పేర్కొన్నారు. ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి, వృత్తిపరంగా ఎదగడానికి తాము భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని చెప్పారు.
Cognizant Learning Center | ఫ్రాంటియర్ వర్క్‌ఫోర్స్ విస్తరణ..
ఏఐ పెట్టుబడులను సంస్థాగత ఫలితాలుగా మార్చేందుకు కాగ్నిజెంట్ తన ‘ఫ్రాంటియర్ వర్క్‌ఫోర్స్’ మోడల్‌ను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా 5,000 మంది ఫ్రాంటియర్ సర్టిఫైడ్ ఇంజనీర్లు, 10,000 మంది ఫ్రాంటియర్ బిజినెస్ ఆపరేటర్లను సిద్ధం చేయనున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది. కాగ్నిజెంట్‌కు భారత్‌లో హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై ( Chennai ), బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, కొచ్చి, కోయంబత్తూర్, భువనేశ్వర్, ఢిల్లీ-ఎన్సీఆర్, గిఫ్ట్ సిటీ, ఇండోర్, మంగళూరు నగరాల్లో బలమైన కార్యకలాపాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narasimha Swamy Kalyanam | కమనీయం.. లక్ష్మీనృసింహుని కల్యాణం