Condom Price Hike | భారీగా పెరగనున్న కండోమ్​ల ధరలు

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Condom Price Hike | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో ఇప్పటికే గ్యాస్​, ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఆ లిస్ట్​లో కండోమ్​లు సైతం చేరనున్నాయి. కండోమ్​లతో పాటు ఆసుపత్రి గ్లౌజుల ధరలు పెరిగే అవకాశం ఉందని కారెక్స్ బెర్హాద్ తెలిపింది. ధరలు 20-30 శాతం మేర పెరగవచ్చని, అలాగే ఆరోగ్య సంరక్షణ సామగ్రిపై ఒత్తిడి పెరుగుతోందని హెచ్చరించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ, మలేషియా (Malaysia)కు చెందిన కారెక్స్ బెర్హాద్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ (Iran) యుద్ధంతో పెట్రోకెమికల్, రబ్బరు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగినట్లు పేర్కొంది. దీంతో లైంగిక ఆరోగ్య ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగవచ్చని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో అడ్డంకులు తీవ్రమవుతున్నందున, రాబోయే నెలల్లో ధరలు 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరగవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం 12 డ్యూరెక్స్ కండోమ్‌ల ప్యాక్ ధర రూ. 270 అయితే, 20 శాతం ధర పెంపు తర్వాత దాని రూ.324 అవుతుంది.

Condom Price Hike | ముడి సరుకు రేట్లు పెరగడంతో..

డ్యూరెక్స్, ట్రోజన్ వంటి ప్రధాన బ్రాండ్‌ల కోసం ఏటా 5 బిలియన్లకు పైగా కండోమ్‌లను కారెక్స్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, సరఫరాలో అంతరాయంతో రేట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హర్ముజ్‌ జలసంధి మీదుగా రాకపోకలు నిలిచిపోవడంతో కండోమ్‌ల ఉత్పత్తికి అత్యవసరమైన సిలికాన్ ఆయిల్, సింథటిక్ రబ్బరు సరఫరాను తీవ్రంగా పరిమితం చేశాయని ఆ సంస్థ సీఈవో మియా కియాట్ తెలిపారు. పెరుగుతున్న ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు.

Condom Price Hike

Condom Price Hike | ఆరోగ్య రంగంపై ప్రభావం

కండోమ్‌లతో పాటు వైద్య గ్లౌజుల ధర దాదాపు 40 శాతం పెరిగింది. మలేషియా, సింగపూర్‌ (Singapore)లోని ఆసుపత్రులలో శస్త్రచికిత్సకు అవసరమైన సామగ్రిని రేషన్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. యుద్ధం మూడవ నెలలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆసియాన్‌లోని ప్రముఖ యూనివర్సల్ బ్యాంకింగ్ గ్రూపులలో ఒకటైన సీఐఎంబీ సెక్యూరిటీస్ విశ్లేషకులు ఒక హెచ్చరిక జారీ చేశారు. సముద్ర మార్గాలను త్వరలో తిరిగి తెరవకపోతే, రబ్బరు రంగంలో ధరల పెరుగుదలతో పాటు అత్యవసర ఆరోగ్య సంరక్షణ రబ్బరు ఉత్పత్తుల కొరతకు దారితీయవచ్చని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Ceasefire Extension | కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్​ ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *