Connaught Place Tiranga March | సీజేపీ తిరంగా మార్చ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) తలపెట్టిన తిరంగా మార్చ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Connaught Place Tiranga March | ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తలపెట్టిన తిరంగా మార్చ్ వివాదంలో సుప్రీంకోర్టు  ( Supreme Court ) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ కావడంతో ఈ నిరసనల వల్ల తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని కొందరు స్థానిక వ్యాపారులు కోర్టును ఆశ్రయించగా.. తక్షణమే ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇరువర్గాలు సంయమనం పాటిస్తూ, విచక్షణతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. పండుగ రద్దీ ఉండే ఈ సమయంలో నిరసనల వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కోర్టు స్పష్టం చేసినప్పటికీ, వ్యాపారుల ఆందోళనపై తక్షణమే జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

Connaught Place Tiranga March | ఢిల్లీ పోలీసుల అప్రమత్తత..

ఈ మార్చ్ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. కన్నాట్ ప్లేస్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే పిలుపునిస్తూ.. జాతీయ జెండాతో కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు చేరుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపడుతున్న ఈ ఆందోళనకు, ఢిల్లీ పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Connaught Place Tiranga March | సెంట్రల్ పార్క్ మూసివేత..

ఈ పరిణామాల మధ్య న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎండీఎంసీ) కీలక చర్యలు చేపట్టింది. సెంట్రల్ పార్క్‌ను సాధారణ ప్రజల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పార్క్‌లోకి అనధికారిక ప్రవేశాలను అడ్డుకోవడానికి పటిష్టమైన భద్రత కల్పించాలని కోరింది. అంతకుముందు ఈ మార్చ్‌ను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ప్రచారంతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

Connaught Place Tiranga March | హెచ్చరికలు..

ఈ నిరసనలకు దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన ప్రదేశంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు, జాతీయ గీతం పాడుకునేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:  MP Mithun Reddy | ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *