Cooperative Societies | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సహకార సంఘాలకు నామినేటెడ్​ పాలకమండళ్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cooperative Societies | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు రద్దు చేసింది. నామినేటెడ్​ విధానంలో పాలక మండళ్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో రైతులు సభ్యులుగా ఉంటారు. గతంలో వీటికి ఎన్నికలు నిర్వహించేవారు. సొసైటీ డైరెక్టర్లను సంఘాల్లోని రైతులను ఎన్నుకునేవారు. అనంతరం డైరెక్టర్లు ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​లను ఎన్నుకునేవారు. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సొసైటీలను దక్కించుకునేవి. అయితే ఇక నుంచి నామినేటెడ్​ విధానంలో ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​, డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్నారు.

Cooperative Societies | అధికారుల సన్నాహాలు

రాష్ట్రంలోని సొసైటీల పాలకవర్గం పదవీ కాలం గతేడాది ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి అధికారులతో కూడిన పర్సన్​ ఇన్​చార్జీ కమిటీలు పని చేస్తున్నాయి. ఎన్నికల కోసం ఇన్ని రోజులుగా రైతులు వేచి చూస్తున్నారు. అయితే తాజాగా పాలకమండళ్లను నామినేట్​ చేస్తామని ప్రకటించడంతో అధికారులు ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్​ కమిటీ పాలకవర్గాలను నామినేటెడ్​ విధానంలో భర్తీ చేస్తున్నారు. సొసైటీలకు కూడా ఇక నుంచి అదే విధానం అమలు చేయనున్నారు. ఫలితంగా అధికార పార్టీలో చాలా మందికి పదవులు దక్కనున్నాయి.

Cooperative Societies | పదవుల పందేరం

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలకు భారీగా పదవులు దక్కనున్నాయి. 908 మందికి ఛైర్మన్లుగా, మరో 908మందికి వైస్‌ ఛైర్మన్లుగా, 9,988మందికి డైరెక్టర్లుగా అవకాశం వస్తుంది. దీంతో కాంగ్రెస్​ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నో రోజులుగా నామినేటెడ్​ పదవుల కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ కార్పొరేషన్​లతో పాటు సొసైటీల పాలక మండళ్లను నియమిస్తే చాలా మందికి అవకాశం దక్కనుంది. అయితే గతంలో ప్రభుత్వం మారితే.. వ్యవసాయ మార్కెట్​ కమిటీలను రద్దు చేసేవారు. గడువుతో సంబంధం లేకుండా.. వారిని తొలగించే తమ పార్టీ వారికి అవకాశం ఇచ్చేవారు. మరి సొసైటీల విషయంలో నిర్ణిత పదవికాలం అమలులో ఉండేలా చేస్తారా.. లేదా అనేది చూడాలి.

Cooperative Societies | 13 మందితో..

సహకారచట్టం ప్రకారం ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఉంటుంది. ఒక ఛైర్మన్​, ఒక వైస్​ ఛైర్మన్​, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్​; బీసీ జనరల్​కు మూడు డైరెక్టర్ పదవులను రిజర్వ్​ చేస్తారు. 10 మంది డైరెక్టర్లను జనరల్‌ కేటగిరీలో నియమిస్తారు. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారితో మాత్రమే పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇది కూడా చదవండి..: Telangana RTC Strike 2 | ఆర్టీసీ డ్రైవ‌ర్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు.. అక్కడ బంద్​కు పిలుపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *