అక్షరటుడే వెబ్‌డెస్క్: Corporate Wellness Technology | భవిష్యత్తులో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ ఒక స్మార్ట్‌వాచ్ హెచ్చరిక, వర్చువల్ డాక్టర్ సంప్రదింపులు లేదా చిన్నపాటి హెచ్చరికతో మొదలుకానుంది. దీనివల్ల ఉద్యోగికి తీవ్రమైన అనారోగ్య సమస్య రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లభిస్తుంది. దశాబ్దాలుగా కార్పొరేట్ వెల్‌నెస్ అంటే కేవలం వార్షిక ఆరోగ్య పరీక్షలు, బీమా సౌకర్యాలు , అప్పుడప్పుడు నిర్వహించే ఫిట్‌నెస్ కార్యక్రమాలుగానే పరిమితమయ్యేది. కానీ నేడు ఈ పద్ధతి వేగంగా మారుతోంది. ఉద్యోగుల ఆరోగ్యానికి, వారి ఉత్పాదకత, ఉద్యోగ నిలకడ (రిటెన్షన్), నిమగ్నతకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని సంస్థలు గుర్తిస్తున్నాయి. సాంకేతికత పుణ్యమా అని.. ఉద్యోగి అనారోగ్య బారిన పడిన తర్వాత ఆదుకునే సాంప్రదాయ విధానం నుంచి, ఏడాది పొడవునా ముందస్తు నివారణ, వ్యక్తిగత సంరక్షణను అందించే స్థాయికి కార్పొరేట్ సంస్థలు మారుతున్నాయి.
టెక్నాలజీతో మారుతున్న ముఖచిత్రం..
ధరించగలిగే పరికరాలు (వేరబుల్స్), హెల్త్ యాప్స్, టెలిమెడిసిన్ సేవలు, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి సాంకేతికతలు ఆరోగ్య సంరక్షణను నేరుగా ఉద్యోగ వాతావరణంలోకి తెచ్చాయి. ఉద్యోగులు తమ నిద్ర వేళలు, శారీరక వ్యాయామం, గుండె కొట్టుకునే వేగం, ఒత్తిడి స్థాయిలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. ఈ డేటా ద్వారా తమ ఆరోగ్యంపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి, వైద్య సహాయం ఎప్పుడు అవసరమో గుర్తించడానికి వీలవుతుంది. ఇక సంస్థల పరంగా చూస్తే.. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన గణాంకాలను గోప్యంగా తెలుసుకునే వెసులుబాటు టెక్నాలజీ కల్పిస్తోంది. తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి లేదా జీవనశైలి సమస్యలతో సతమతమయ్యే ఉద్యోగులకు, ఎర్గోనామిక్ సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వేర్వేరు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
Corporate Wellness Technology | ఫార్మా, టెక్ కంపెనీల కీలక పాత్ర.
ఈ మార్పులో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వ్యాధి నివారణ, డయాగ్నస్టిక్స్, చికిత్స, క్లినికల్ పరిశోధనల్లో వీటికి ఉన్న అనుభవం.. మరింత శాస్త్రీయమైన ఉద్యోగ ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించడానికి సహాయపడుతుంది. ఈ రంగంలోని కంపెనీలు టీకాలపై అవగాహన, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, ముందస్తు స్క్రీనింగ్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ముందున్నాయి. మరోవైపు టెక్నాలజీ కంపెనీలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వైద్య సంప్రదింపులు, మానసిక కౌన్సిలింగ్, పోషకాహార సలహాలు, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లు, ఆరోగ్య రికార్డులను ఒకే వేదికపైకి తెస్తున్నాయి. ఉద్యోగులు వేర్వేరు యాప్‌లను ఆశ్రయించకుండా, ఒకే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా ఆరోగ్య సేవలను పొందవచ్చు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) జోరు..
కార్పొరేట్ వెల్‌నెస్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) మరో శక్తిగా ఎదుగుతున్నాయి. విభిన్న నేపథ్యాలు కలిగిన ఉద్యోగులు, గ్లోబల్ టెక్నాలజీ నైపుణ్యం ఉన్న జిసిసిలు వివిధ రకాల వెల్‌నెస్ మోడళ్లను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. డిజిటల్ వెల్‌నెస్ డాష్‌బోర్డ్‌లు, ఫ్లెక్సిబుల్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలు, వర్చువల్ హెల్త్‌కేర్ సేవలు, డేటా ఆధారిత ప్రివెంటివ్ ప్రోగ్రామ్‌లను ఇవి పరీక్షిస్తున్నాయి.
Corporate Wellness Technology | మానవ స్పర్శ, డేటా గోప్యత కూడా ముఖ్యమే..
అయితే కేవలం డిజిటల్ సాంకేతికతలు మాత్రమే ఒక కార్యాలయాన్ని ఆరోగ్యకరంగా మార్చలేవు. ఉద్యోగులు ఎలాంటి భయం, జంకు లేకుండా సహాయం కోరే వాతావరణం ఆఫీసులో ఉండాలి. ఒత్తిడిని తట్టుకోలేకపోయినా, పర్యవసానాలకు భయపడి సహాయం అడగలేకపోతే ఏ మానసిక సేవలు కూడా పనిచేయవు.
అలాగే, డేటా గోప్యత అనేది కార్పొరేట్ ఆరోగ్య కార్యక్రమంలో అత్యంత కీలకం. ఆరోగ్య సమాచారం చాలా సున్నితమైనది కాబట్టి.. ఏ రకమైన డేటాను సేకరిస్తున్నారు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఎవరికి అందుబాటులో ఉంటుంది అనే విషయాలపై ఉద్యోగులకు స్పష్టత ఉండాలి. టెక్నాలజీ అనేది కేవలం నిఘా పెడుతుందనే భావన కాకుండా, తమపై నమ్మకాన్ని పెంచుతుందనే భరోసానివ్వాలి. టెక్నాలజీ ప్రమాదాలను గుర్తించగలదు, సేవలను సులభతరం చేయగలదు.. కానీ మానవ నాయకత్వమే ఉద్యోగులకు భద్రతా భావన్ని ఇవ్వగలదు. ఫార్మా, బయోటెక్, ఐటీ కంపెనీలు, జీసీసీలు ఇలా అన్నీ కలసి పనిచేసినప్పుడే కార్పొరేట్ వెల్‌నెస్ అనేది కేవలం అనారోగ్యానికి స్పందించేలా కాకుండా.. ముందస్తుగా, ఉద్యోగ కేంద్రీకృత వ్యవస్థగా మారుతుంది.
• డాక్టర్ అంకితా శ్రీవాత్సవ, చీఫ్, న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్