Cyberabad C&D Waste Centre | సైబరాబాద్‌లో భవన నిర్మాణ , కూల్చివేత (సీ అండ్ డీ) వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గౌలిదొడ్డిలో ‘రీ-సస్టైనబిలిటీ’ సహకారంతో ఏర్పాటు చేసిన తొలి ప్రత్యేక సీ అండ్ డీ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. రోజుకు 100 టన్నుల వరకు వ్యర్థాలను నిర్వహించే సామర్థ్యం ఉన్న ఈ కేంద్రాన్ని మెట్రోపాలిటన్ ఏరియా , పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. సృజన కూడా పాల్గొన్నారు.
Cyberabad C&D Waste Centre | వ్యర్థాల నిర్వహణే లక్ష్యం..
మన రోడ్లు, జలాశయాలు, ఖాళీ స్థలాలను కాపాడుకోవడానికి నిర్మాణ వ్యర్థాలను క్రమపద్ధతిలో నిర్వహించడం ఎంతో అవసరమని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఈ బదిలీ కేంద్రం ద్వారా వ్యర్థాలను సేకరించి అధికారిక ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించేందుకు చక్కటి వ్యవస్థ ఏర్పడిందని, ఇది సుస్థిర పట్టణాభివృద్ధికి, పరిశుభ్రతకు దోహదపడుతుందని తెలిపారు.
Cyberabad C&D Waste Centre | సులభతర సేవలు..
ఈ కేంద్రం ద్వారా కొండాపూర్ ( Kondapur ), మసీద్ బండ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, మణికొండ, నల్లగండ్ల , శేరిలింగంపల్లి ప్రాంతాల ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు తమ నిర్మాణ వ్యర్థాల నిర్వహణ సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. తక్కువ పరిమాణంలో వ్యర్థాలు ఉన్న సాధారణ పౌరుల కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తక్కువ చార్జీలతో ‘ఆన్-డిమాండ్ కలెక్షన్’ సేవలను కూడా ప్రత్యేకంగా అందిస్తోంది. అయితే, ఎవరైనా రోడ్ల పక్కన, చెరువుల వద్ద, ఖాళీ స్థలాల్లో అక్రమంగా వ్యర్థాలను పారబోస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ డాక్టర్ జి. సృజన గట్టిగా హెచ్చరించారు.
Cyberabad C&D Waste Centre | సాంకేతికతతో పారదర్శక పర్యవేక్షణ..
ఈ కేంద్రంలో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ వేబ్రిడ్జ్ , డేటా రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వేబ్రిడ్జ్‌పై నమోదైన అసలు బరువు ఆధారంగానే రుసుము వసూలు చేస్తారు. అంతేకాకుండా ఈ కేంద్రం పూర్తిగా సీసీటీవీ నిఘాలో పనిచేస్తూ పారదర్శకతను కలిగి ఉంటుంది. సైబరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి నాలుగు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించగా, గౌలిదొడ్డి కేంద్రం అందులో మొదటిది. మిగతా మూడు కేంద్రాలను కూడా త్వరలో ఏర్పాటు చేసి, అనధికారిక డంపింగ్‌ను పూర్తిగా అరికట్టాలని అధికారులు నిర్ణయించారు.