అక్షరటుడే, వెబ్‌డెస్క్: Student Loan Harassment | చదువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే విద్యార్థులే లక్ష్యంగా కొందరు వడ్డీ దందా చేస్తున్నారు. అధిక మిత్తికి డబ్బులు ఇచ్చి వారి కుటుంబాలను ఆగం చేస్తున్నారు. అంతేగాకుండా విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి సాయ పడుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో బీటెక్ విద్యార్థులు ఎక్కువగా వడ్డీ వ్యాపారులకు బలి అవుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి నగరానికి లక్షలాది మంది విద్యార్థులు వస్తుంటారు. అయితే వీరిలో కొందరు స్నేహితులతో సరదాగా గడపడానికి, గర్ల్ ఫ్రెండ్‌తో సినిమాలు, షికార్లకు వెళ్లడానికి, పార్టీల కోసం బయట అప్పులు చేస్తున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా.. బయట వడ్డీకి డబ్బు తీసుకుంటున్నారు. ప్రతి నెలా కొంత మొత్తం అడ్జస్ట్ చేస్తామనే ధీమాతో అప్పులు తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం మధ్య తరగతి పిల్లలు ఉండటం గమనార్హం.
Student Loan Harassment | రూ.20 మిత్తికి..
కాలేజీ విద్యార్థులు బయట వడ్డీ వ్యాపారులతో పాటు లోన్ యాప్‌ల్లో డబ్బులు తీసుకుంటున్నారు. విద్యార్థులకు డబ్బులు ఇచ్చేవారు ఐడీ కార్డు, ఆధార్ కార్డు వివరాలు తీసుకుంటున్నారు. రూ.వందకు ప్రతి నెల రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అవసరం కొద్ది డబ్బులు తీసుకుంటున్న విద్యార్థులు.. తర్వాత వాటిని చెల్లించలేకపోతున్నారు. రూ.10 వేలు అప్పు తీసుకుంటే.. నెలకు రూ.2 వేల మిత్తి అవుతోంది. దానిని తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారు. ఇలా అప్పలు రూ.లక్ష దాటి పోతున్నాయి. డబ్బులు కట్టపోతే అప్పు ఇచ్చిన వారు వేధింపులకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. విద్యార్థులు సైతం ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రులకు విషయం చెబుతున్నారు. వారు ఆస్తులు, బంగారం అమ్మి పిల్లల అప్పులు కడుతున్నారు. లోన్ యాప్‌ల్లో సైతం భారీగా వడ్డీ తీసుకుంటున్నారు.
Student Loan Harassment | జీవితాలు నాశనం
సాధారణంగా విద్యార్థులు కాలేజీ, చదువు అవసరాల కోసం ఇంటి వద్దే డబ్బు అడుగుతున్నారు. ఇంట్లో చెప్పలేని కారణాలకు మాత్రం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా స్నేహితులతో మద్యం తాగడానికి, షికార్లకు వెళ్లడానికి అప్పు చేస్తున్నారు. తర్వాత దానిని తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేసిన అప్పులతో వ్యసనాలు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఉన్నారు. అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు పాల్పడుతున్నా.. పరువు పోతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. గుట్టుగా డబ్బులు కట్టి వెళ్లిపోతున్నారు. దీంతో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు.
Student Loan Harassment | చర్యలు కరువు
నగరంలో కాలేజీ విద్యార్థులు అధికంగా ఉండే ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు దందా చేస్తున్నారు. విద్యార్థులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పడం లేదు. అయితే అప్పు తీర్చకపోతే మాత్రం వారికి ఫోన్లు చేస్తున్నారు. దాదాపు ప్రతి కాలేజీలో ఈ దందా సాగుతోంది. అయినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Cyberabad C&D Waste Centre | సైబరాబాద్‌లో తొలి సీ అండ్ డీ వ్యర్థాల సేకరణ కేంద్రం ప్రారంభం