Cyclone Arnab Alert | ‘అర్నబ్’ తుఫాన్ అలర్ట్.. 32 వేల మంది సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికిస్తున్న 'అర్నబ్' తుఫాన్ (Cyclone Arnab) తీవ్రత, క్షేత్రస్థాయి పరిస్థితులు , సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డెస్క్: Cyclone Arnab Alert | ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికిస్తున్న ‘అర్నబ్’ తుఫాన్ (Cyclone Arnab) తీవ్రత, క్షేత్రస్థాయి పరిస్థితులు , సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ( Chandrababu Naidu )ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు దాదాపు 32 వేల మంది అధికారులతో సీఎం సుదీర్ఘ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అత్యవసర సమీక్ష చేపట్టారు. విద్యుత్‌, ఇరిగేషన్‌, రోడ్లు-భవనాలు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Cyclone Arnab Alert | ప్రాణనష్టం లేకుండా ..

అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకున్న పటిష్ట చర్యల వల్లే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రంతా శ్రమించి సహాయక చర్యలు అందించిన అధికారులు, ఉద్యోగాలు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు ఇదే స్ఫూర్తితో నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

Cyclone Arnab Alert | రెండు గంటల్లోగా చెట్ల తొలగింపు..

ప్రాణనష్టం జరగకుండా చూడటంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై ఈదురుగాలులకు కూలిపోయిన చెట్లను రెండు గంటల వ్యవధిలోనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై చెట్లు పడితే వెంటనే తొలగించాలని తెలిపారు. గాలుల తీవ్రత తగ్గగానే దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, తీగలను పరిశీలించి, ప్రజలకు ప్రమాదం లేకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు.

Cyclone Arnab Alert | మనమిత్ర సేవలు..

తుఫాన్ షెల్టర్లు, పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ‘మనమిత్ర’ వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఫిర్యాదులు రాగానే పరిష్కరించి ఆ వివరాలను సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని ఆదేశించారు.

Cyclone Arnab Alert | పంట నష్టం అంచనాలు..

తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, ఉద్యాన పంటల నష్టంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ఇరిగేషన్ అధికారులు పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ, అన్ని శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Jio Platforms IPO | చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్.. రెండో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *