Devshayani Ekadashi | తొలి ఏకాదశి రోజు ఈ దానాలు చేస్తే లచ్చిందేవి వద్దన్నా వస్తుంది.. పూజా విధానం ఇలా ఉండాలి

ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశిని ఈ సంవత్సరం జులై 25న జరుపుకోనున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Devshayani Ekadashi | ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఈ పవిత్రమైన ఏకాదశిని ఈ సంవత్సరం జులై 25న జరుపుకోనున్నారు. ఈ రోజును దేవశయని ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ శుభదినాన శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. ఈ కాలాన్నే చాతుర్మాస్యం అని పిలుస్తారు. ఈ సమయంలో విశ్వ పరిపాలనా బాధ్యతలను పరమశివుడు నిర్వహిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజున విష్ణుమూర్తితో పాటు శివారాధన చేయడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయి.

Devshayani Ekadashi | పూజా విధానం..

తొలి ఏకాదశి రోజు ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు నెయ్యితో దీపం వెలిగించి, తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తామని సంకల్పించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు, పసుపు రంగు పూలతో ఆరాధించి పంచామృతాన్ని సమర్పించాలి. ఆ తర్వాత ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాలను జపిస్తూ, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. పూజ అనంతరం పాలు, పండ్లు, పాయసం లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా నివేదించాలి.

Devshayani Ekadashi | ఉపవాస నియమాలు..

తొలి ఏకాదశి నాడు సాధకులు తమ శరీర దృఢత్వాన్ని బట్టి నిర్జల ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవచ్చు. ఒకవేళ ఆరోగ్య రీత్యా ఉపవాసం చేయలేని వారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ రోజున బియ్యంతో చేసిన వంటకాలు, ఉల్లి, వెల్లుల్లి , మాంసాహారానికి పూర్తి దూరంగా ఉండటం ముఖ్యం. సాయంత్రం వేళ మళ్లీ దీపారాధన చేసి, తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. మరుసటి రోజు ద్వాదశి తిథి పుణ్యకాలంలో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే పారణ చేసి ఉపవాసాన్ని విరమించాలి.

Devshayani Ekadashi |విశేష దానాల ఫలితం..

తొలి ఏకాదశి రోజు చేసే దానాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర రోజున పేదలకు లేదా అర్హులకు అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరంగా పరిగణిస్తారు. వీటితో పాటు తులసి మొక్క, పసుపు రంగు వస్త్రాలు, ధాన్యాలు, నెయ్యి, గొడుగు లేదా పాదరక్షలను దానం చేయడం వల్ల జాతకంలోని సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక ( Spiritual ) వేత్తలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  CJP Protest | సీజేపీతో మరోసారి చర్చలకు సిద్ధం.. కేంద్రం కీలక ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *