Diagnostic Center Scam | స్కానింగ్​ సెంటర్ల దోపిడీ.. వైద్యుల సిండికేట్​తో రోగుల జేబులకు చిల్లు

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ సాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Diagnostic Center Scam | ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ సాగుతోంది. కొందరు వైద్యులు తమకు అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లను ప్రోత్సహిస్తూ రోగుల నుంచి వేలాది రూపాయలు గుంజుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Diagnostic Center Scam | అవసరం ఉన్నా.. లేకున్నా..

ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా పరీక్షలు రాయడం, నిర్దేశించిన చోటే చేయించుకోవాలని ఒత్తిడి చేయడం వంటి పద్ధతులు సర్వసాధారణమయ్యాయి. దీనిపై వైద్యాధికారులు కూడా కళ్లు మూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పట్టణంలో విచ్చలవిడిగా స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్​లు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు సిండికేట్​గా మారి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖ అధికారులను పెద్దమొత్తంలో మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరం లేకున్నా పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.

Diagnostic Center Scam | ల్యాబ్​లు, స్కానింగ్ సెంటర్ల ఏర్పాటు

కామారెడ్డి (Kamareddy) పట్టణంలో గత మూడేళ్లలో 15కి పైగా డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. వీటిలో చాలావరకు ప్రముఖ వైద్యుల బంధువులు, సన్నిహితుల పేరిట నడుస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగిని నేరుగా ఈ సెంటర్లకు పంపే విధంగా ఒక అనధికారిక ఒప్పందం నడుస్తోందని రోగులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ల్యాబ్, డయాగ్నస్టిక్ సెంటర్లకు సంబందించిన టెస్ట్ ప్రింట్ పేపర్స్ వైద్యుడి టేబుల్​పై ముందుగానే ఉంచుతున్నారు.

Diagnostic Center Scam | సాధారణ సమస్యతో వచ్చినా..

జ్వరం, తలనొప్పి వంటి సాధారణ సమస్యలతో వచ్చినా కూడా పూర్తి బాడీ చెకప్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఖరీదైన పరీక్షలు రాయడం పరిపాటిగా మారింది. ఒకసారి అన్ని టెస్టులు చేయించుకుంటే మంచిది అంటూ వైద్యులు సూచిస్తున్నారు. దీంతో రూ.300 ఫీజుతో వచ్చిన రోగి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. స్కానింగ్, డయాగ్నస్టిక్ ఎంఆర్ఐ సెంటర్ నిర్వాహకులకు డిస్కౌంట్ ఇవ్వాలని బాధిత ప్రజలు కోరినా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. అత్యంత దగ్గరి పరిచయం ఉన్న వైద్యులతో ఫోన్ చేయిస్తే మాత్రం రూ.2 నుంచి 3 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.

Diagnostic Center Scam | చెప్పిన చోట టెస్ట్ చేయిస్తేనే ఓకే..

వైద్యులు రాసిన చోట కాకుండా రోగులు బయట మరో ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుని వస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మేము రాసిన ల్యాబ్‌లోనే చేయించుకోండి, అప్పుడే రిపోర్టు కరెక్ట్‌గా ఉంటుంది అంటూ తిరస్కరిస్తున్నారు. దీంతో రోగులు మళ్లీ అదే మొత్తం ఖర్చు చేసి టెస్టులు చేయించుకోవాల్సి వస్తోంది. ఇది స్పష్టమైన కమీషన్ వ్యవస్థ అని స్థానికులు మండిపడుతున్నారు.

Diagnostic Center Scam | రూ.వేలల్లో దోచుకుంటున్న వైనం

ఒక్కో రోగి నుంచి నెలకు సగటున 3 వేల నుంచి 8 వేల వరకు అదనపు ఖర్చు చేయిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందాల్సిన సేవలు కూడా బయట ప్రైవేట్ సెంటర్లకు తరలిస్తున్న ఘటనలు ఉన్నాయి. అక్కడ సరైన సౌకర్యాలు లేక బయటకు పంపిస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Diagnostic Center Scam | పట్టించుకోని వైద్యాధికారులు

డయాగ్నస్టిక్, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదులు అందినా జిల్లా వైద్యాధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది. తనిఖీలు పేరుకు మాత్రమే జరుగుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఆధారాలు తెండి అంటూ చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చిన ఈ సిండికేట్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Arvind SIR Campaign | ‘సర్​’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి.. రోహింగ్యాలను తరమికొట్టాలి..: ఎంపీ అర్వింద్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *