అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Development | హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో ‘ప్రీమియర్ ఎనర్జీస్’ నూతన సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని గురువారం ( జులై 9 )ఆయన ప్రారంభించారు.
Hyderabad Development | ఆర్థికాభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణను పారిశ్రామికంగా, ఆర్థికంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల ప్రకారం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని ప్రకటించారు. దేశ జీడీపీలో 10 శాతం వాటా తెలంగాణ నుంచే వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Hyderabad Development | కాలుష్య రహిత నగరం కోసం..
హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా ఉంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. నగరంలోని పరిశ్రమలను దశలవారీగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) అవతలికి తరలించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ORR , రీజనల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామన్నారు. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, చెన్నైలో నీటి సమస్యల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. అలాగే, మూసీ నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని పునరుద్ఘాటించారు.
Hyderabad Development | స్కిల్ యూనివర్సిటీ..
పరిశ్రమల ఏర్పాటుతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. విద్యావంతులైన యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పరిశ్రమల కోసం తమ భూములను ఇచ్చిన సీతారాంపూర్ ప్రజలకు, గతంలో భూత్యాగం చేసిన రంగారెడ్డి జిల్లా రైతులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Arvind SIR Campaign | ‘సర్’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి.. రోహింగ్యాలను తరమికొట్టాలి..: ఎంపీ అర్వింద్