అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Drone Attack | యూఏఈ (UAE)లోని అబుదాబిలోని అణువిద్యుత్ కేంద్రం సమీపంలో ఆదివారం డ్రోన్ దాడులు జరిగాయి. ఈ ఘటనతో అక్కడ మంటలు చెలరేగాయి.
బరాకా అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఇరాన్ (Iran), అమెరికా (America) మధ్య చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో డ్రోన్ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం అల్ ధఫ్రా ప్రాంతంలోని ప్లాంట్ లోపలి పరిధికి వెలుపల ఉన్న ఒక విద్యుత్ జనరేటర్ వద్ద ఈ మంటలు చెలరేగాయని అబుదాబి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని పేర్కొన్నారు.
Drone Attack | దాడి ఎవరు చేశారు
అరేబియా ద్వీపకల్పంలోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రమైన ఈ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరగడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. అయితే ఈ ఘటనతో ప్లాంట్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అణు నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఎవరు ప్రకటించలేదు. తమ రక్షణ దళాలు రెండు డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకున్నాయని, మూడవది ప్లాంట్ సమీపంలోని ఒక జనరేటర్‌ను ఢీకొట్టిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అణు సౌకర్యాలకు ముప్పు కలిగించే సైనిక కార్యకలాపాలు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది.
దీనిని కూడా చదవండి : Hormuz Strait attacks | నౌకలపై దాడులను ఖండించిన భారత్


