అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Force | మేఘాలయలోని షిల్లాంగ్ నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ (Hyderabad) నగరంలో విక్రయిస్తున్న ముఠాను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో కాగ్నిజెంట్ ఉద్యోగి కూడా ఉన్నాడు.
ఈ ముఠా షిల్లాంగ్‌లో తక్కువ ధరలకు గంజాయిని కొనుగోలు చేస్తారు. అనంతరం రైలు మార్గంలో హైదరాబాద్‌కు తీసుకొస్తారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి, వాట్సాప్ ఆర్డర్లు, స్థానిక డెలివరీ ఏర్పాట్ల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మేడ్చల్‌లోని ఎన్‌జీవో కాలనీలో, న్యూ క్లాసిక్ ధాబా వెనుక ఉన్న పద్మావతి హోమ్స్‌లోని ఫ్లాట్‌లో ఈగల్ ఫోర్స్ దాడి చేసింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. వారి నుంచి సుమారు రూ. 4.5 లక్షల విలువైన 9 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి కొనుగోలు చేసిన తొమ్మిది మంది వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించారు.
Eagle Force | గంజాయికి బానిసై..
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు మనీష్ కుమార్ ఝా (27) తన కాలేజీ రోజుల్లో గంజాయికి బానిస అయ్యాడు. ప్రస్తుతం అతడు కాగ్నిజెంట్‌లో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. అయితే గతంలో గంజాయి బానిస కావడంతో.. తర్వాత గంజాయి దందాలోకి దిగాడు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన మనీష్, మొదట వ్యక్తిగత వినియోగం కోసం ఫతేనగర్ వంతెన సమీపంలో గంజాయిని కొనుగోలు చేశాడు. అనంతరం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అతను షిల్లాంగ్‌లోని సరఫరాదారులతో సంబంధాలు ఏర్పరచుకుని, ఆ మాదకద్రవ్యాన్ని అమ్మడం ప్రారంభించాడు. అద్దె కార్ల వ్యాపారం నడుపుతున్న అతని తమ్ముడు రతీష్ కుమార్ ఝా (23), ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన రాహుల్ సమల్ (26) అతడికి సహకరించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
దీనిని కూడా చదవండి : Delimitation Bill | ‘డీలిమిటేషన్’ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. కేటీఆర్ ప్రశ్న