అక్షరటుడే, బాన్సువాడ: Manjeera Checkdams | మంజీర నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చెక్‌డ్యాంల కారణంగా రైతుల జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద బండపల్లి, గుండె నెమ్లి, వాజిద్‌నగర్, పూల్కల్, బండరెంజల్ గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యేను కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు, బావుల్లో నీరు లేక పంటలు సాగు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారమన్నారు. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడిందని తెలిపారు. దీంతో రెండు పంటలు సమృద్ధిగా సాగు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని పేర్కొన్నారు. తమ గ్రామాల రైతుల జీవితాల్లో ఈ సానుకూల మార్పుకు కృషి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Manjeera Checkdams | రైతు క్షేమం ప్రభుత్వాల బాధ్యత
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రైతులను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ప్రభుత్వాలు, నాయకులు రైతుల పక్షాన చిత్తశుద్ధితో పనిచేస్తే రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే స్థాయికి ఎదుగుతారన్నారు. రైతన్న చేయి ఎప్పుడూ కింద ఉండకూడదని, నలుగురికి సాయం చేసే స్థాయిలో పైచేయిగా ఉండాలని ఆకాంక్షించారు.
Manjeera Checkdams | నాలుగు అంశాలు కీలకం
తన నియోజకవర్గంలోని రైతు సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే తన లక్ష్యమని పోచారం తెలిపారు. రైతు ప్రతి యేటా పంట కోసం అప్పులు తీసుకుని, పంట అమ్మిన తర్వాత అప్పులు తీర్చి, మళ్లీ తదుపరి పంటకు రుణం తీసుకునే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. పంట సమృద్ధిగా పండాలంటే భూమి, నాణ్యమైన విత్తనం, రైతు కష్టం, నీరు అనే నాలుగు అంశాలు కీలకమన్నారు. ఇందులో భూమి, విత్తనం, కష్టపడే తత్వం రైతు వద్ద ఉన్నాయన్నారు. ప్రభుత్వం సకాలంలో సాగునీరు, విద్యుత్తు అందిస్తే రైతులు సమృద్ధిగా పంటలు పండించగరని వివరించారు.
Manjeera Checkdams | లక్షా 48 వేల ఎకరాల సాగుభూమి
బాన్సువాడ నియోజకవర్గంలో లక్షా 48 వేల ఎకరాల సాగుభూమి ఉందని ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ఇందులో సుమారు 98 వేల ఎకరాలు నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన భూములకు బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందుతోందన్నారు. జాకోర–చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 10 వేల ఎకరాలకు నీరు అందించడంతో పాటు, మిగిలిన భూములకు సిద్ధాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలో నస్రుల్లాబాద్ మండలంలోని హాజీపూర్ చెరువును తవ్వించడంతో హాజీపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలు, పక్క మండలాల వరకు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు.
Manjeera Checkdams | 600 ఎకరాలకు పర్క్యులేషన్ ల్యాంకుల నిర్మాణం
మైలారంలో నిజాంసాగర్ కాలువ నీరు అందని సుమారు 600 ఎకరాలకు పర్క్యులేషన్ ట్యాంకుల నిర్మాణం చేపట్టడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్ల కింద రెండు పంటలు సాగు చేస్తున్నారని పోచారం తెలిపారు. ఒక చెరువు, ఒక చెక్‌డ్యాం కేవలం నీటిని నిల్వ చేసే నిర్మాణం మాత్రమే కాదన్నారు. దాని చుట్టుపక్కల వందలాది రైతు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే అభివృద్ధి సాధనమని పోచారం పేర్కొన్నారు.
Manjeera Checkdams | వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే..
రాష్ట్రంలోని సాగుభూములకు సాగునీరు అందించడంతో పాటు చెరువులు, చెక్‌డ్యాంలు, విద్యుత్తు వంటి సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయాలని పోచారం తెలిపారు. రైతుకు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం మిగిలేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్ర రైతుల చేతుల్లోనే భారీ సంపద సమకూరుతుందని పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి ఆత్మగౌరవంతో సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసే రోజులు రావాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధి, రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని పోచారం తెలిపారు.
ఇది కూడా చదవండి..: CP Sai Chaitanya | ఎస్సై ప్రిలిమినరీ రాతపరీక్ష కేంద్రాల పరిశీలన