KCR Deeksha | కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు..: మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, ఎల్లారెడ్డి: KCR Deeksha | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక ఆమరణ దీక్షను స్మరించుకుంటూ ఎల్లారెడ్డిలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి కొత్త ఊపునిచ్చి, తెలంగాణ ఏర్పాటు దిశగా కీలక పరిణామాలకు కారణమైందని పేర్కొన్నారు.

KCR Deeksha | అవరోధాలను అధిగమించి పోరాటం

ప్రతి ఏటా నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమం నాటి ఉద్యమ స్ఫూర్తిని, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి గుర్తుచేస్తుందని జాజాల తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్ర అన్యాయానికి గురైందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్నో అవరోధాలను అధిగమించి పోరాటం చేశారని గుర్తు చేశారు.

KCR Deeksha | అన్ని రంగాల అభివృద్ధికి కృషి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధికి కృషి చేశారని సురేందర్​ వివరించారు. అయితే, ఎంతోమంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వెనుకబడుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో పయనించాలంటే నాటి ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

KCR Deeksha | కేసీఆర్‌ను తిరిగి సీఎంను చేసుకుందాం..

కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి నిరంతరం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Rayapati Sambasiva Rao | మాజీ ఎంపీ సాంబశివరావు మృతి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *