అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Virus Outbreak | ఆఫ్రికా ఖండంలో ఎబోలా (Ebola) వైరస్ కలకలం రేపుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రంగంలోకి దిగింది. పరిస్థితి తీవ్రతను బట్టి దీనిని ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ (అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా డబ్ల్యూహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్ మరింతగా విస్తరించకుండా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Ebola Virus Outbreak | పొరుగు దేశాలకూ ముప్పు..
కాంగో, ఉగాండా దేశాలలో ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత ఎబోలా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి 88 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. కాంగోలో మొదలైన ఈ వైరస్ వ్యాప్తి, ప్రస్తుతం సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాకు కూడా పాకింది. అంతర్జాతీయ ప్రయాణాలు, సరిహద్దుల ద్వారా ఇది ఇతర దేశాలకు విస్తరించకుండా ఉండాలంటే తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ebola Virus Outbreak | వేగంగా అందనున్న అంతర్జాతీయ సాయం..
ప్రస్తుత క్లిష్టమైన పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమై సమీక్ష నిర్వహించింది. అనంతరం దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ (PHEIC) గా ప్రకటించింది. ఈ అత్యవసర ప్రకటన వల్ల బాధిత దేశాలకు అంతర్జాతీయ సమాజం నుండి ప్రత్యేక నిధులు, అవసరమైన వ్యాక్సిన్లు, వైద్య సాయం వేగంగా అందుతాయి.
Ebola Virus Outbreak | లక్షణాలు..
ఎబోలా అనేది అత్యంత వేగంగా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన వైరస్. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే అంతర్గతంగా , బాహ్యంగా రక్తస్రావం (Bleeding) జరుగుతుంది. ఇది సోకిన రోగుల శరీర ద్రవాల (రక్తం, లాలాజలం వంటివి) ద్వారా ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే, కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: TG EAPCET Results | తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల


