అక్షరటుడే, వెబ్‌డెస్క్: Electric Auto Scheme | తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం విద్యుత్ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad) మహా నగరం పరిధిలో డీజిల్, పెట్రోలో ఆటోలను పూర్తిగా తొలగించి, ఎలక్ట్రిక్ ఆటోలు వినియోగించాలని ఇప్పటికే ఆదేశించింది.
డ్రైవర్లు విద్యుత్ ఆటోలకు మారడానికి ప్రభుత్వం “తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026”ను అమలు చేస్తోంది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లు ప్రస్తుతం ఉన్న ఆటోను విద్యుత్ వాహనంగా మార్చుకోవచ్చు. లేదంటే దానిని ఇచ్చేసి కొత్తగా విద్యుత్ ఆటో కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది.
Electric Auto Scheme | 18 వేల ఆటోలు
రవాణా శాఖ లెక్కల ప్రకారం.. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతంలో ప్రస్తుతం 18,766 అర్హత కలిగిన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) ఆటో రిక్షాలు చెల్లుబాటు అయ్యే పర్మిట్లపై నమోదై, చురుకుగా పనిచేస్తున్నాయి. వీటిని విద్యుత్ వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్లు రెండు రకాల ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. ప్లాన్–ఏ ఎంచుకునే లబ్ధిదారులు తమ ప్రస్తుత వాహన ఛాసిస్‌ను అలాగే ఉంచుకుని, తమ వాహనానికి AIS-123 ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవచ్చు. ఈ పథకం కింద రూ.1.50 లక్షలు, లేదా కిట్ అసలు ఖర్చు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆర్థిక సహాయంగా అందిస్తారు.
Electric Auto Scheme | కొత్త ఆటో కొనొచ్చు
ప్లాన్ బీ ప్రకారం.. డ్రైవర్లు తమ పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వాహనాన్ని పూర్తిగా వదులుకోవాలని ఎంచుకున్న లబ్ధిదారులు, ఫ్యాక్టరీలో తయారైన, టైప్-అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్ (L5M)ను కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద రూ.1.50 లక్షలఫ్లాట్ సబ్సిడీని అందిస్తారు. ఈ సబ్సిడీని, ఎంప్యానెల్డ్ డీలర్లు ఎంపిక చేసిన మోడల్ తుది ఆన్-రోడ్ ధరకు ముందుగానే అందజేస్తారు. ఏ పథకం ఎంచుకున్న లబ్ధిదారులకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది.
Electric Auto Scheme | ఆయా శాఖల నుంచి నిధులు
ఈ పథకం కోసం ఆయా సంక్షేమ శాఖలు నిధులు సమకూర్చాల్సి ఉంటుందని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ రూ.50 కోట్లు, ఎస్టీ లబ్ధిదారుల కోసం షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ రూ.50 కోట్లు, బీసీ లబ్ధిదారుల కోసం బీసీ సంక్షేమ శాఖ రూ.50 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ మరో రూ.50 కోట్లు కేటాయించాలి. ఈ పథకాన్ని రవాణా కమిషనర్ ద్వారా అమలు చేస్తారు.
Electric Auto Scheme | లబ్ధిదారుడు భరించాలి
ఆటో డ్రైవర్లు కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేయాలి అనుకుంటే ప్రభుత్వం రూ.1.50 లక్షల సబ్సిడీ మాత్రమే ఇస్తుంది. మిగతా మొత్తం లబ్ధిదారుడే భరించాల్సి ఉంటుంది. కిట్ మార్పిడి విషయంలో సైతం ప్రభుత్వం గరిష్టంగా రూ.1.50 లక్షల ఆర్థిక సాయం ఇస్తుంది. అంతకంటే ఎక్కువ అయితే మిగతా మొత్తం లబ్ధిదారులు భరించాలి. డ్రైవర్లు తమకు ఇష్టమైన ఆటో మోడల్‌ను ఎంచుకోవచ్చు.
దీనిని కూడా చదవండి : Traffic Control Measures | ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు : సీఎస్ సంజయ్ జాజు