అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal Floods | నేపాల్‌లో ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణకు చెందిన పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాస రెడ్డి తెలిపారు. అక్కడ రాష్ట్రానికి చెందిన 23 మంది చిక్కుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించినట్లు తెలిపారు.
నేపాల్ చిక్కుకున్న తెలంగాణ ప్రజల ప్రస్తుత పరిస్థితి, ఆచూకీ తెలుసుకోవడంతో పాటు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, కాఠ్మాండు భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)లోని సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ (NRI విభాగం) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితుల కుటుంబాల నుంచి సమాచారం సేకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు.
Nepal Floods | వివరాలు అందించాలి
ఇంకా ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్‌లో చిక్కుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలని ఆయన కోరారు. బాధితుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో చివరిగా ఉన్న ప్రదేశం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు నంబర్లు అందిస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న, ప్రభావితమైన తెలంగాణ ప్రజల కుటుంబ సభ్యులు సమాచారం కోసం లక్ష్మీనారాయణ (9885371189), కె. శ్రీనివాస్ రెడ్డి (7997959754), చిట్టిబాబు (9440854433) లను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
దీనిని కూడా చదవండి : Harish Rao BRS Conspiracy | బీఆర్ఎస్ను దక్కించుకునేందుకు హరీశ్‌రావు కుట్ర : కవిత