Harish Rao BRS Conspiracy | బీఆర్​ఎస్​ను దక్కించుకునేందుకు హరీశ్​రావు కుట్ర : కవిత

కేసీఆర్​కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్​రావు కుట్ర పన్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao BRS Conspiracy | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్​కు వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్​రావు కుట్ర పన్నారని ఆరోపించారు.

మెదక్​ ఎమ్మెల్యేలతో హరీశ్​రావు (Harish Rao) ఇటీవల మీటింగ్​ పెట్టారని కవిత చెప్పారు. కేటీఆర్​కు వారసత్వం లేదని, బీఆర్ఎస్​ పార్టీ తనకే వస్తదని ఆయన చెప్పారని ఆరోపించారు. మెదక్​లో అన్ని సీట్లు గెలుచుకొని, బీజేపీతో అగ్రిమెంట్​ చేసుకుందామని ఆయన ఎమ్మెల్యేలకు చెప్పారని కవిత అన్నారు. మెదక్​ నుంచి బీఆర్​ఎస్​ను హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారని, కేసీఆర్​కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని ఆరోపించారు. హరీశ్​రావు ఆర్​ఎస్​ఎస్​ పెద్ద మనిషితో పలుమార్లు సమావేశం అయ్యారన్నారు. ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అని విమర్శించారు.

Harish Rao BRS Conspiracy | ఆంధ్ర రేవంత్​రెడ్డి

కవిత సీఎం రేవంత్​రెడ్డిపై విమర్శలు చేశారు. అనుముల రేవంత్​రెడ్డి కాదని, ఆయన ఆంధ్ర రేవంత్​ రెడ్డి అని కవిత అన్నారు. బ్రాహ్మణ పరిషత్​ కార్పొరేషన్​ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్లుగా ప్రభుత్వం ఆంధ్రకు చెందిన వారిని నియమించారన్నారు. మన తెలంగాణలో ఎంతో మంది పండితులు ఉండగా.. ఆంధ్రకు చెందిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. ఛైర్మన్​గా నియమితులైన వ్యక్తిని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిని తొలగించాలని కవిత డిమాండ్​ చేశారు. ఆంధ్ర ఎంపీ కొడుకు ర్యాష్​ డ్రైవింగ్​తో ఒక యువతి ప్రాణాలు తీస్తే పోలీసులు అతడికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. గతంలో బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు బారీకేడ్లను ఢీకొడితే హంగామా చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఎంపీ కుమారుడు యువతి ప్రాణాలు తీస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

Harish Rao BRS Conspiracy | ఆంధ్ర పెత్తనం

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తోందని కవిత విమర్శించారు. సీఎంవో కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏపీకి చెందిన వారు అన్నారు. ఇరిగేషన్​ శాఖలో చాలా మంది ఆంధ్ర​ అధికారులు ఉన్నారని చెప్పారు. యాదగిరి గుట్ట బోర్డులో ఆంధ్రకు చెందిన నటుడి భార్యను ఎలా మెంబర్​గా నియమించారని ప్రశ్నించారు. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో తెలంగాణ నర్సులకు తక్కువ వేతనం, కేరళ నర్సులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. రేవంత్​రెడ్డి ఆంధ్ర ఏజెంట్​గా మారారని విమర్శించారు.

Harish Rao BRS Conspiracy | క్విడ్​ ప్రోకో కేసు పెట్టాలి

ఒడిశా యువతి చనిపోతే బీఆర్​ఎస్​ సైతం మాట్లాడలేదని కవిత అన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మధ్య ఏం లాలూచీ ఉందని ప్రశ్నించారు. నారాయణ, చైతన్య కాలేజీలపై బీఆర్​ఎస్​ పార్టీ ఒక్క మాట మాట్లాడదన్నారు. హరీశ్​రావు ఆ కాలేజీలకు పాలు అమ్ముకుంటారని, అందుకే మాట్లాడరని పేర్కొన్నారు. గుంట నక్కకు, గుంపు మేస్త్రీకి లండన్​లో లాలూచీ జరిగిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్​రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నగరంలోని అనేక ఆస్పత్రులకు, కాలేజీలకు ఆయన కంపెనీ ద్వారా పాలు సరఫరా చేశారన్నారు. దీనిపై క్విడ్​ ప్రోకో కేసు పెట్టాలని కవిత డిమాండ్​ చేశారు. హరీశ్​రావుతో సీఎం రేవంత్​రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే వెంటనే పాలు సరఫరా చేసే ఒప్పందాన్ని రద్దు చేసి, విజయ డెయిరీ పాలు సరఫరా చేసేలా జీవో విడుదల చేయాలన్నారు.

Harish Rao BRS Conspiracy | బీఆర్​ఎస్​ అవినీతి

బీఆర్​ఎస్​ హయాంలో వ్యవస్థీకృతమైన అవినీతి చేశారన్నారు. పాల పేరిట హరీశ్​రావు, మున్సిపల్ అనుమతులు, రియల్​ ఎస్టేట్​ పేరిట కేటీఆర్​, ఇసుక వ్యాపారంతో మరొకరు అవినీతి చేశారన్నారు. అవినీతి పార్టీ అయిన బీఆర్ఎస్​కు కాకుండా కొత్త పార్టీ అయిన తమక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి..: KTR Jindal University | కేటీఆర్‌కు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆహ్వానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *