అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa | యాసంగిలో రైతు భరోసా వస్తుందా.. రాదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కరువు కాటేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతు భరోసా జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఎకరాకు రూ.6 వేల చొప్పున వానాకాలం, యాసంగి సీజన్లలో జమ చేస్తోంది. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలైంది. పలు ప్రాంతాల్లో రైతులు (Farmers) పంటల సాగు ప్రారంభించారు. బోరుబావులు ఉన్న రైతులు వరి, ఆరు తడి పంటలు వేస్తున్నారు. అయితే ఇంత వరకు యాసంగి పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Rythu Bharosa | ఎల్నినో ప్రభావంతో..
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోంది. జలాశయాలు ఖాళీ అయ్యాయి. భూగర్భ జలాలు లోతుకు పడిపోయాయి. వానాకాలంలోనే పంటలను కాపాడుకోవడానికి రైతులు అనేక తిప్పలు పడ్డారు. ఈ క్రమంలో యాసంగిలో పంటలు వేయొద్దని ప్రభుత్వం చెబుతోంది. నీళ్లు ఇవ్వలేమని, కరెంట్ సైతం ఇచ్చే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలా మంది రైతులు పంటలు సాగు చేయొద్దు అనుకుంటున్నారు. సాగు విస్తీర్ణం సగానికంటే ఎక్కువగా తగ్గనుంది. పంటలు సాగు చేయడం లేదు కాబట్టి రైతు భరోసా వేయరని పలువురు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరువుతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం రైతు భరోసా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Jupally Krishna Rao | రెండో పంటకు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి : మంత్రి జూపల్లి