Rare Vision Disorder | మనుషుల ముఖాల్లో పిల్లి కళ్లు.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి విచిత్ర సమస్య..

ఉదయం నిద్రలేవగానే మీ పెంపుడు పిల్లిని చూసి, ఆ తర్వాత బయటకు వెళ్లి ఎవరిని చూసినా వారి ముఖాల్లో పిల్లి కళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది?

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rare Vision Disorder | ఉదయం నిద్రలేవగానే మీ పెంపుడు పిల్లిని చూసి, ఆ తర్వాత బయటకు వెళ్లి ఎవరిని చూసినా వారి ముఖాల్లో పిల్లి కళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో హారర్ సినిమా కథలా అనిపిస్తోంది కదూ. కానీ అమెరికాకు చెందిన ఓ 28 ఏళ్ల యువకుడికి నిజంగానే ఇలాంటి విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. మనుషుల ముఖాల్లో తన పెంపుడు పిల్లి కళ్లు, వాటి ఆకారం, చారలు కనిపిస్తుండటంతో అతడు ఆశ్చర్యపోతున్నాడు. అంతేకాదు.. ఉదయం మొదట ఎవరిని చూస్తాడో రోజంతా ఇతరుల ముఖాల్లోనూ అవే లక్షణాలు కనిపిస్తుండటం విశేషం. బ్రెయిన్ సర్జరీ తర్వాత మొదలైన ఈ వింత పరిస్థితి ఇప్పుడు వైద్య పరిశోధకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

Rare Vision Disorder | వింత అనుభవం వెనుక కారణం..

అమెరికాకు చెందిన 28 ఏళ్ల కార్ల్‌కు ‘లూనా’ అనే బూడిద రంగు చారలున్న పెంపుడు పిల్లి ఉంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే లూనా ముఖమే అతనికి మొదట కనిపిస్తుంది. అయితే కొన్ని రోజులుగా ఉదయం పిల్లిని చూస్తే చాలు.. ఆ తర్వాత రోజంతా ఎదురయ్యే మనుషుల ముఖాల్లోనూ పిల్లి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లికి ఉండే బాదం గింజల ఆకారపు కళ్లు, పెద్ద కనుపాపలు, ముఖంపై ఉండే చారలు ఇతరులలో కనిపిస్తున్నాయి. కేవలం ఎదురుగా ఉన్నవారికే కాదు, ఆన్‌లైన్‌లో చూసే ఫొటోలు, వీడియోల్లోని మనుషుల ముఖాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఉదయం మొదట తన పిల్లిని కాకుండా ఓ మనిషిని చూస్తే, ఆ వ్యక్తి ముఖంలోని లక్షణాలే ఆ తర్వాత రోజంతా కనిపించే ఇతరుల ముఖాల్లో ప్రతిబింబిస్తున్నాయి. చివరకు తన పెంపుడు పిల్లి లూనా ముఖంలోనూ ఆ మనిషి ముఖ లక్షణాలే కనిపిస్తుండటం గమనార్హం.

Rare Vision Disorder | వైద్య పరిశోధనల వెల్లడి..

ఈ వింత అనుభవం కల్పితం కాదని, దీనిపై పరిశోధకులు ‘కార్‌టెక్స్’ (Cortex) అనే వైద్య జర్నల్‌లో ప్రత్యేక అధ్యయనాన్ని ప్రచురించారు. దాదాపు రెండేళ్ల క్రితం కార్ల్‌కు మెదడులో రక్తనాళాలకు సంబంధించిన ‘ఆర్టీరియోవీనస్ మాల్‌ఫార్మేషన్’ (AVM) సమస్య తలెత్తింది. దీనికి చికిత్సలో భాగంగా వైద్యులు మెదడులోని కుడివైపు టెంపోరల్ లోబ్‌లో కొంత భాగాన్ని తొలగించారు. ముఖాలను గుర్తించడం, వాటి లక్షణాలను విశ్లేషించడంలో ఈ భాగం కీలక పాత్ర పోషిస్తుంది. సర్జరీ తర్వాతే అతనికి ఈ సమస్య ప్రారంభమైంది. ఇది ప్రధానంగా రెండు దృష్టి సంబంధిత పరిస్థితుల వల్ల కలుగుతోందని వైద్యులు తేల్చారు.

పాలినోప్సియా (Palinopsia): గతంలో చూసిన దృశ్యాలు లేదా వాటి లక్షణాలు మెదడులో నిలిచిపోయి, ఆ తర్వాత చూసే దృశ్యాల్లోనూ మళ్లీ కనిపించడం.

ప్రోసోపోమెటామార్ఫోప్సియా (Prosopometamorphopsia): ఎదుటివారి ముఖాలు సహజంగా కనిపించకుండా వక్రీకరించినట్లు, లక్షణాలు తారుమారైనట్లు అనిపించడం.

ఈ రెండు పరిస్థితుల ప్రభావంతో గతంలో చూసిన ముఖ లక్షణాలు, ప్రస్తుతం చూస్తున్న వ్యక్తుల ముఖాలపై ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. బాధితులు ఎదుర్కొంటున్న ఈ వింత అనుభవాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో చిత్రాల రూపంలో వెలికితీసి అధ్యయనం చేస్తున్నారు. చాలామంది ఇలాంటి సమస్యలను మానసిక సమస్యగా పొరబడి తప్పుగా చికిత్స పొందుతున్నారని, ఇది కేవలం దృష్టి సంబంధిత సమస్య మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Harish Rao Criticism | అభయ హస్తం కాదు మొండి హస్తం.. కాంగ్రెస్​ పాలనపై హరీశ్​రావు విమర్శలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *