Free train travel | విద్యార్థులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్: ప్యాసింజర్ రైళ్లలో పూర్తిగా ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే?

జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిబంధనల ప్రకారం రైలు టికెట్ ధరల్లో ప్రత్యేక రాయితీ లభిస్తుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Free train travel | గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి రోజూ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

చదువుకునే విద్యార్థుల ప్రయాణ ఖర్చులు ఆదా చేసేలా ప్యాసింజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే ఈ విషయం చాలామంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు.

Free train travel | ఎవరికి ఉచిత ప్రయాణం వర్తిస్తుంది?

రైల్వే నిబంధనల ప్రకారం.. విద్యాభ్యాసం కోసం నిత్యం రైళ్లలో రాకపోకలు సాగించే విద్యార్థులకు ఈ ఉచిత పాస్‌లు జారీ చేస్తారు.

బాలురకు: ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు చదువుతున్న బాలురు ప్యాసింజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు.

బాలికలకు: మహిళా విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో బాలికలకు డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తయ్యే వరకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందిస్తోంది.

Free train travel | ముఖ్యమైన నిబంధనలు ఇవే..

ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కేవలం ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ (జనరల్) కోచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే విద్యార్థులు నివసించే ఇంటికి, వారు చదువుకునే విద్యాసంస్థకు మధ్య దూరం గరిష్టంగా 150 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ఈ పరిధిలో ఉన్న స్టేషన్ల మధ్య విద్యార్థులు ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు.

Free train travel | ఉచిత పాస్ (MST) పొందడం ఎలా?

ఈ రాయితీని పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు ముందుగా తమ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలి. అనంతరం సమీపంలోని రైల్వే స్టేషన్‌ టికెట్ కౌంటర్‌ను సంప్రదించి, తమ విద్యాసంస్థ గుర్తింపు కార్డు (ID Card), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంబంధిత పత్రాలను సమర్పించాలి.

అధికారులు వాటిని పరిశీలించి విద్యార్థులకు ఉచిత మంత్లీ సీజన్ టికెట్ (MST) జారీ చేస్తారు. ఈ పాస్ ద్వారా నిర్ణీత కాలపరిమితి వరకు రోజువారీ ప్రయాణాన్ని ఉచితంగా కొనసాగించవచ్చు.

Free train travel | ఇతర రాయితీలు కూడా..

కేవలం రోజువారీ ప్రయాణాలకే కాకుండా, విద్యార్థుల కోసం రైల్వే శాఖ మరిన్ని రాయితీలను కూడా అమలు చేస్తోంది. పాఠశాలలు, కళాశాలల తరఫున నిర్వహించే విద్యా పర్యటనలు (ఎడ్యుకేషనల్ టూర్లు), అలాగే వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిబంధనల ప్రకారం రైలు టికెట్ ధరల్లో ప్రత్యేక రాయితీ లభిస్తుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు సమీప రైల్వే స్టేషన్‌లో వివరాలు తెలుసుకుని ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *