Godavari Water | గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర : హరీశ్​రావు

గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Godavari Water | గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ప్రభుత్వంలో 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే.. ఆ అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందని హరీశ్​రావు అన్నారు. ఆ ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, సీతారామ లాంటి 7 ప్రాజెక్టులు రద్దు చేయాలని ఏపీ కోరిందన్నారు. జీఆర్ఎంబీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్లు ఉంటారని చెప్పారు. ఈ ఎజెండా తయారు అవుతుంటే తెలంగాణ ఇంజినీర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Godavari Water | చేతగాని ప్రభుత్వం

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఏండ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తేలేదని హరీశ్​రావు అన్నారు. పైగా బీఆర్ఎస్ తెచ్చిన అనుమతులు రద్దు చేయాలనే ఎజెండా వచ్చిందని విమర్శింంచారు. ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణను పోరాటాలతో తెచ్చుకున్నామన్నారు. నీళ్ల కోసం కొట్లాడమని గుర్తు చేశారు. అదే నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదని హెచ్చరించారు.

Godavari Water | ఏపీ కోసం..

47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Fertilizer Booking | రైతులకు అలర్ట్​.. ఇక అన్ని ఎరువులు యాప్​లో బుక్​ చేయాల్సిందే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *