అక్షరటుడే వెబ్డెస్క్: Hyderabad Bus Theft | సమయస్ఫూర్తి, సాహసం ప్రదర్శించి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో దొంగను ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులో బంగారం, నగదు ఉన్న బ్యాగుతో పాటు ప్రయాణికుల సెల్ఫోన్లు చోరీ చేసి పరారవుతున్న నిందితుడిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ డి. మల్కయ్య సంగారెడ్డి నుంచి నగరానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. అంతకుముందు సంగారెడ్డి బస్టాండ్లో ఓ బ్యాగును, బస్సు ప్రయాణంలో కొందరి సెల్ఫోన్లను కాజేసిన ఒక వ్యక్తి, కంది స్టేజీ రాగానే హడావుడిగా కిందకు దిగాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బస్సు కండక్టర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు.
Hyderabad Bus Theft | అర కిలోమీటరు ఛేజింగ్..
కండక్టర్ హెచ్చరికను గమనించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మల్కయ్య క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు దిగి ఆ అనుమానితుడి వైపు వెళ్లారు. కానిస్టేబుల్ను చూసి ఆ వ్యక్తి పరుగు తీయడంతో, కండక్టర్ అనుమానం నిజమేనని గ్రహించిన మల్కయ్య సుమారు అర కిలోమీటరు మేర రన్నింగ్ ఛేజ్ చేసి చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు. విచారణలో నిందితుడిని రాజమండ్రి ప్రాంతానికి చెందిన బి. వెంకటేశ్వర్లుగా గుర్తించారు.
Hyderabad Bus Theft | పోలీసులకు అప్పగింత..
నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన బ్యాగుతో పాటు మొబైల్ ఫోన్లను మల్కయ్య స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదే బస్సులో నిందితుడిని తరలించి పటాన్చెరు ( Patancheru )పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కానిస్టేబుల్ మల్కయ్యతో పాటు బస్సు డ్రైవర్, కండక్టర్ నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొమ్మును పోలీసులకు అందజేశారు. ఆ బ్యాగులో నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. విధి నిర్వహణకు వెళ్తూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి దొంగను పట్టుకున్న కానిస్టేబుల్ మల్కయ్య సాహసాన్ని ప్రయాణికులు ప్రశంసించగా, హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఇది కూడా చదవండి: PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్