అక్షరటుడే వెబ్‌డెస్క్: Heart Liver Kidney Health | శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీలు ( kidney )సక్రమంగా పనిచేస్తున్నంత కాలం మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోము. గుండె రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తుండగా, కాలేయం పోషకాలను ప్రాసెస్ చేసి జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అలాగే కిడ్నీలు మలినాలను వడకట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ అవయవాలకు జరిగే నష్టం ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే క్రమంగా జరుగుతుంటుంది. కాబట్టి సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Heart Liver Kidney Health | అవయవాల ఆరోగ్యం ..
ఈ ముఖ్యమైన అవయవాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు), మధుమేహం (డయాబెటిస్), స్థూలకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలు అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. హైదరాబాద్‌లోని న్యూబర్గ్ డయాగ్నస్టిక్స్ చీఫ్ డాక్టర్ అంకిత శ్రీవాస్తవ మాట్లాడుతూ, “చాలామంది గుండె, కాలేయం లేదా కిడ్నీల గురించి సమస్యలు వచ్చినప్పుడే ఆలోచిస్తారు. కానీ చాలా ఆరోగ్య సమస్యలు కాలక్రమేణా నిశ్శబ్దంగా పెరుగుతుంటాయి. ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా ఇటువంటి ముప్పులను ముందుగానే గుర్తించి అవయవాలను రక్షించుకోవచ్చు” అని తెలిపారు.
Heart Liver Kidney Health | ఆహారపు అలవాట్లలో మార్పులు..
ఆరోగ్యకరమైన ప్రయాణం సరైన ఆహారంతో మొదలవుతుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, గింజలతో కూడిన సమతుల్య ఆహారం గుండె, జీవక్రియల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఉప్పు, పంచదార, వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తగ్గించడం వల్ల బీపీ, ఊబకాయం, డయాబెటిస్ ముప్పును నివారించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ జాగింగ్, నడక, సైక్లింగ్, ఈత లేదా మెట్లు ఎక్కడం వంటి సాధారణ అలవాట్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వ్యాయామం తీవ్రంగా కాకుండా, రోజూ క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం.
Heart Liver Kidney Health | తగిన మోతాదులోనే నీరు..
కిడ్నీల పనితీరు సక్రమంగా ఉండటంలో హైడ్రేషన్ (నీరు తాగడం) కీలకమే అయినప్పటికీ, అవసరానికి మించి విపరీతంగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వయసు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరాలు మారుతుంటాయి. గుండె లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే నీటి మోతాదును పాటించాలి. ధూమపానం రక్తనాళాలను దెబ్బతీసి గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. అలాగే మద్యం సేవించడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. వీటికి దూరంగా ఉండటం దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. నిద్రలేమి, ఒత్తిడి కూడా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. తగినంత నిద్రపోవడం, నడక, బ్రీతింగ్ వ్యాయామాలు వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను పాటించడం మంచిది.
Heart Liver Kidney Health | నిపుణుల పరిశీలన..
45 ఏళ్ల ఒక వ్యక్తి ఎలాంటి లక్షణాలు లేకపోయినా రొటీన్ హెల్త్ చెకప్‌కు రాగా, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా ఫ్యాటీ లీవర్ సమస్య ఉన్నట్లు తేలింది. రొటీన్ పరీక్షల వల్ల ఎలాంటి లక్షణాలు బయటపడక ముందే ముప్పులను గుర్తించవచ్చని ఈ కేస్ నిరూపిస్తోంది. రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం ద్వారా గుండె, జీవక్రియల ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఊబకాయం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా అవయవాలపై భారాన్ని తగ్గించవచ్చు. ట్రూనాట్ (Truenat) వంటి మాలిక్యులర్ డయాగ్నస్టిక్ సాంకేతికతలు వ్యాధి నిర్ధారణలో సహాయపడతాయి. సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవితం మరియు సరైన సమయంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె, కాలేయం, కిడ్నీలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Student Protest FIRs | నిరసనకారులపై కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఆందోళన విరమించిన సీజేపీ