అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Liberation Day | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ ( C P Radhakrishnan )ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చారిత్రక వేడుకల్లో పాల్గొనడం ఎంతో గౌరవంగా ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ సంస్థానం విమోచన కోసం, దేశంలో దాని విలీనం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులను గౌరవించేందుకే ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు.
Hyderabad Liberation Day | ప్రజా ఉద్యమంగా పోరాటం..
హైదరాబాద్ విమోచన పోరాటంలో చరిత్రపుటల్లో మరుగునపడిన ఎంతోమంది వీరుల గాథలను నేటి తరానికి వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ పోరాటం కొద్దిమంది నాయకులకు లేదా ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కాలేదని, ఇదొక అపూర్వమైన ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు. ఈ పోరులో విద్యార్థులు, మేధావులు, రచయితలు, సామాజిక-రాజకీయ కార్యకర్తలు, రైతులు, సామాన్య ప్రజలు సైతం భాగస్వామ్యులయ్యారని గుర్తుచేశారు. ఈ క్రమంలో ఎంతోమంది జైలు శిక్షలు, కఠిన హింసలు, వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ వంటి వీరుల త్యాగాలను జాతీయ స్థాయిలో ఎప్పటికీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్రను కేవలం పెద్దల కార్యాలయాలే కాకుండా, సామాన్య ప్రజల త్యాగాలు కూడా నిర్మిస్తాయని కొనియాడారు.
Hyderabad Liberation Day | సర్దార్ పటేల్ చొరవ ..
స్వతంత్ర భారతదేశాన్ని ఏకం చేయడంలో భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని రాధాకృష్ణన్ ప్రశంసించారు. బలమైన, సమైక్య భారతదేశానికి ఆయన బలమైన పునాది వేశారని, ఎవరికీ సాధ్యం కాని రీతిలో హైదరాబాద్ సంస్థాన విలీనాన్ని సుసాధ్యం చేశారని తెలిపారు. రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు చూపిన అసాధారణ ధైర్యం, పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పవని అన్నారు. ఈ సందర్భంగా పోరాట యోధులకు, సర్దార్ పటేల్‌కు ఆయన శిరస్సు వంచి నమస్కరించారు.
Hyderabad Liberation Day | నక్సలిజం అణచివేత ..
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర ప్రాంతాలలో వామపక్ష తీవ్రవాదాన్ని (నక్సలిజం) ఎదుర్కొనడంలో కేంద్ర బలగాలు ఎంతో సమర్థవంతంగా పనిచేశాయని ఉపరాష్ట్రపతి తెలిపారు. రాష్ట్ర పోలీసులతో కలిసి కేంద్ర సాయుధ బలగాలు సమన్వయంతో నక్సల్స్ ప్రభావాన్ని అణచివేశాయన్నారు. నక్సల్స్ ముప్పు తొలగిపోవడంతో గతంలో అస్థిరత నెలకొన్న ప్రాంతాలలో ఇప్పుడు శాంతిభద్రతలు ఏర్పడి, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాలలో అభివృద్ధి కనిపిస్తోందని వివరించారు. సురక్షితమైన, అభివృద్ధి చెందిన భారతే లక్ష్యంగా భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు.
Hyderabad Liberation Day | రాజ్యాంగ ప్రజాస్వామ్యం..
రాజకీయ విలీనం కేవలం భౌగోళిక ప్రాంతాలను మాత్రమే కలుపుతుందని, కానీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ప్రజలందరినీ హృదయపూర్వకంగా ఏకం చేస్తుందని రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. జాతీయ ఐక్యత అనేది కేవలం సరిహద్దులపైనే ఆధారపడి ఉండదని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు లభించినప్పుడే అది మరింత బలపడుతుందని చెప్పారు. ప్రజలందరూ వేర్వేరు భాషలు మాట్లాడినా, భిన్న సంప్రదాయాలు పాటించినా, విభిన్న పద్ధతుల్లో పూజలు చేసినా.. మనమందరం రాజ్యాంగం, దేశ సార్వభౌమత్వ భావనతో ఒక్కటేనని స్పష్టం చేశారు. మన సార్వభౌమత్వానికి అసలైన అధికారం ప్రజలదేనని తెలిపారు.
Hyderabad Liberation Day | ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి..
2022 సంవత్సరం నుంచి హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహిస్తున్నామని రాధాకృష్ణన్ గుర్తుచేశారు. దేశ ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు అందరం ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “భారత్ ఒక్కటే.. భారత్ ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది. ఇదే సర్దార్ పటేల్‌కు మనం అర్పించే నిజమైన నివాళి” అని ఆయన తన ప్రసంగం ముగింపులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Disha Salian | ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు