అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Umrah Tragedy | సౌదీ అరేబియాలో ( Saudi Arabia )జరిగిన బాంబు దాడి హైదరాబాద్‌లోని ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర కోసం కుటుంబసమేతంగా వెళ్లిన నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి మహమ్మద్ యూసుఫ్ (46) ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు.
Hyderabad Umrah Tragedy | ఒక్కసారిగా బాంబు దాడి..
సౌదీ అరేబియాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న మహమ్మద్ యూసుఫ్, తన భార్య , ముగ్గురు పిల్లలతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మదీనాకు వెళ్లేందుకు వారు వేచి చూస్తుండగా ఒక్కసారిగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాలు తగలడంతో యూసుఫ్ అక్కడిక్కడే మృతి చెందారు. ఆయన భార్య, పిల్లలు, మరికొందరు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Hyderabad Umrah Tragedy | ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి..
ఈ ఘోర ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన యూసుఫ్ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని, ఆయన భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖను కోరారు.
Hyderabad Umrah Tragedy | సాయం అందించేందుకు ..
ఈ దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందిస్తూ సంతాపం తెలిపారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ద్వారా బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని, వైద్య చికిత్స , ఇతర అవసరాల విషయంలో భారత దౌత్య అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు.
Hyderabad Umrah Tragedy | పెరుగుతున్న హౌతీ దాడులు..
గత కొద్దిరోజులుగా సౌదీ అరేబియాని లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు విమానాశ్రయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. సౌదీ బలగాలు ఈ దాడులను తిప్పికొడుతున్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. అంతర్జాతీయంగా టర్కీ, పాకిస్థాన్ సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం, అమెరికా మద్దతు సైతం పరిమితంగా ఉండటంతో సౌదీ అరేబియా భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Saudi Airport Missile Attack | సౌదీ ఎయిర్‌పోర్టుపై మరోసారి క్షిపణులతో దాడి