అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inter Board Merger | విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్పునకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు వెలువడుతున్న సమాచారం విద్యావర్గాలతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, అధ్యాపకల సంఘాల్లో చర్చకు దారితీసింది.
ఇప్పటివరకు స్వతంత్ర వ్యవస్థగా ఉన్న ఇంటర్ విద్యామండలిని రద్దు చేసి, 11–12 తరగతులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రతిపాదన రాష్ట్రంలో తీవ్రంగా దుమారం రేపుతోంది. ప్రభుత్వం దీన్ని “విద్యార్థి కేంద్రిత సంస్కరణ”గా చిత్రీకరిస్తుంటే.. ఇంటర్ విద్య జేఏసీ, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మాత్రం “తెలుగు రాష్ట్రాల బలమైన విద్యా మోడల్‌ను బలహీనపరిచే నిర్ణయం”గా విమర్శిస్తున్నాయి.
ఈ పరిణామం కేవలం ఒక పరిపాలనా మార్పు కాదు; తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు విద్యా నిర్మాణాన్ని పూర్తిగా ప్రభావితం చేసే విధానాత్మక మార్పుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
Inter Board Merger | ఇంటర్ బోర్డు నేపథ్యం..
కోఠారి కమిషన్ సిఫారసుల మేరకు (1969-70) అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డు వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటివరకు పీయూసీ, హెచ్‌యూసీ విధానాలు ఉండేవి. వాటిని రద్దు చేసి, పదో తరగతి తర్వాత రెండేళ్ల ప్రత్యేక విద్యా దశగా ఇంటర్‌మీడియట్‌ను రూపొందించారు. దీని వెనుక ప్రధాన ఉద్దేశం పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యకు విద్యార్థిని శాస్త్రీయంగా సిద్ధం చేయడమే.
కాల గమనంలో దశాబ్దాలుగా ఈ ఇంటర్ విద్య వ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో బలమైన అకాడమిక్ ఫౌండేషన్‌గా విరాజిల్లుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్, వంటి జాతీయ–రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు ఆధిపత్యం చాటడానికి ఇంటర్ విద్యా విధానం కీలక భూమిక పోషించిందనేది నిర్వివాదాంశం.

Inter Board Merger | విలీనానికి ఎందుకు మొగ్గు..?
ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థ గ్రామీణ విద్యార్థులకు అనుకూలంగా లేదనేది ప్రభుత్వం, తెలంగాణ విద్యా కమిషన్ వాదన. రాష్ట్రంలో 26 వేలకుపైగా సర్కారు బడులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మాత్రం కేవలం 436 మాత్రమే ఉండటం ప్రధాన సమస్యగా పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో పదో తరగతి పూర్తయ్యాక విద్యార్థులు ఇంటర్ విద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల లేమి, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, సామాజిక కారణాల వల్లనే చాలా మంది నిరుపేద విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని కమిషన్ అభిప్రాయం. ముఖ్యంగా బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటానికి ఇది ఒక కారణమని కమిషన్ వాదన.
Inter Board Merger | 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందించడం వల్ల..
గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు తగ్గుతాయని, విద్యార్థుల్లో మానసిక భద్రత పెరుగుతుందని, ఉపాధ్యాయులకు విద్యార్థుల అభివృద్ధిపై దీర్ఘకాలిక అవగాహన ఏర్పడుతుందని, ల్యాబ్‌లు, లైబ్రరీల వంటి వనరులను సమర్థంగా వినియోగించవచ్చని సర్కారు చెబుతోంది.
దీనికితోడు ప్రస్తుతం కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో ఇప్పటికే 12వ తరగతి వరకు బోధన ఉండటం వల్ల మిగతా వాటిల్లో కూడా అదే విధానం కొనసాగించడం ద్వారా విద్యా విధానాన్ని సమం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన.
Inter Board Merger | ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒకే విధానం..
మరో ముఖ్య విషయం ఏమిటంటే.. “ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా 12వ తరగతి వరకు స్కూల్ విద్యగానే పరిగణిస్తారు..” అని సర్కారు పేర్కొంటోంది. ఇది కొంతవరకు వాస్తవమని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికా, ఫిన్లాండ్‌తోపాటు యూరప్‌లోని చాలా దేశాల్లో K-12 మోడల్ అమల్లో ఉంది. అంత వరకు ఎందుకూ.. మన దేశంలో సీబీఎస్ఈ విధానంలో కూడా 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తారు.
Inter Board Merger | కానీ తక్షణం మార్చితే…
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేస్తామని ఏడాది కాలంగా సర్కారు పేర్కొంటూనే ఉంది. కానీ, అందుకు తగిన ప్రణాళికను రూపొందించడంలో మాత్రం తాత్సారం చేస్తూ వచ్చింది. మరో నెల రోజుల్లో కాలేజీలు ప్రారంభం కానున్న తరుణంలో ఇప్పుడు ఆఘమేఘాల మీద ప్రతిపాదన అమలు చేస్తామనం ఎంత వరకు సమంజసమో విధాన పరమైన నిర్ణేతలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే తక్షణ అమలుతో.. విద్యా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, టీచర్ ట్రైనింగ్, విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి, పరీక్షా విధానం, సామాజిక పరిస్థితులు ప్రభావితం కానున్నాయి.
సర్కారు తాజా ప్రతిపాదనను ఇంటర్ విద్య జేఏసీ, అధ్యాపక సంఘాల నేతలు, పలువురు విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదనను పరిశీలిస్తే.. ఇంటర్ అనేది కేవలం మరో రెండు తరగతులు మాత్రమే కాదు; ఈ ఇంటర్ అనేది ఉన్నత విద్యకు – పోటీ పరీక్షలకు విద్యార్థిని సిద్ధం చేసే ఒక ప్రత్యేక అకాడమిక్ దశగా వర్ణిస్తున్నారు.
ప్రధానంగా అభ్యంతరాలను పరిశీలిస్తే…
పోటీ పరీక్షలపై ప్రభావం: తెలుగు రాష్ట్రాలకు చెందిన అత్యధిక విద్యార్థులు జేఈఈ, నీట్, సీఏ, ఒలింపియాడ్స్ వంటి పరీక్షల్లో విజయాలు సాధించడానికి ఇంటర్ అకడమిక్ విద్యా నమూనానే ప్రధాన కారణమని చెబుతున్నారు. ప్రత్యేకంగా సబ్జెక్టు ఫోకస్, ఇంటెన్సివ్ బోధన, ప్రత్యేకంగా లెక్చరర్ల వ్యవస్థ ఉండటం వల్లే ఈ స్థాయి ఫలితాలు వస్తున్నాయని వాాదిస్తున్నారు.
అదనపు భారం: ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, ఫలితాల ఒత్తిడితో సతమతమవుతున్నాయని.. ఇక 11-12 తరగతులను కూడా పాఠశాలలకే జోడిస్తే పరిపాలనా పరంగా గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు.
నాణ్యత తగ్గే ప్రమాదం: ఇంటర్ బోర్డు ఉండటం వల్ల ప్రత్యేక పరీక్షా వ్యవస్థ నిర్వహణ, ప్రశ్నపత్రాల రూపకల్పన, అకాడమిక్ పర్యవేక్షణ సాఫీగా కొనసాగుతోందని.. విలీనం వల్ల ఈ ప్రత్యేకతలన్నీ బలహీనపడి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఎవరితోనూ చర్చించకుండా..: లెక్చరర్లు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో చర్చించకుండా సర్కారు ఈ విషయంలో ముందుకు వెళ్లడం సరైంది కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.

సమస్య బోర్డులోనా..? లేక సర్కారు విధానంలోనా..?
విమర్శకుల నుంచి వెలువడే ప్రశ్నల్లో అత్యంత కీలకమైనది ఇదే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తక్కువగా ఉండటమనేది నిజమే. కానీ, దానికి పరిష్కారం ఇంటర్ బోర్డు రద్దు చేయడమేనా..? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయొచ్చు కదా.. రవాణా సౌకర్యాలు మెరుగుపర్చవచ్చు కదా.. వసతి గృహాలు నిర్మించవచ్చు కదా.. అని నిలదీస్తున్నారు.
బలోపేతం చేయాల్సింది పోయి..
ఒక వ్యవస్థలో సమస్యలు ఉంటే.. వాటిని పరిష్కరించాల్సింది పోయి.. మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం ఎంత వరకు సమంజసం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇంటర్ వ్యవస్థనే రద్దు చేయడం సులభ మార్గంగా సర్కారు భావిస్తోందని నిలదీస్తున్నారు.
అమలులో ఎదురయ్యే సవాళ్లు..
విలీన ప్రతిపాదనతో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. వాటిని పరిశీలిస్తే..
ఇంటర్ లెక్చరర్ల సేవల వినియోగం ఎలా ?
సిలబస్ నిర్మాణం ఎలా ఉండనుంది?
బోర్డు పరీక్షల నిర్వహణ చేపట్టేది ఎవరు ?
కార్పొరేట్ కాలేజీల వ్యవస్థను ఏం చేస్తారు ?
JEE/NEET కోచింగ్ మోడల్ ఎలా ఉండనుంది ?
గ్రామీణ బడుల్లో ల్యాబ్‌లు, ఫ్యాకల్టీలు అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమా ?
వీటికి సమాధానాలు ఆలోచించకుండా నేరుగా అమలు చేస్తే గందరగోళం తప్పదని హెచ్చరిస్తున్నారు.
రాజకీయంగా విమర్శలు..
విలీనం ప్రతిపాదన కేవలం విద్యా చర్చకే పరిమితం కాకుండా రాజకీయంగానూ విమర్శలకు దారితీస్తోంది. ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యల్లో రాజకీయ హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తోంది. “ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణల వల్లనే జగన్‌కు పరాజయం ఎదురయ్యింది..”అనే వ్యాఖ్య ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి వస్తుందని పరోక్షంగా హెచ్చరిక కనబడుతోంది.
అయితే సర్కారు మాత్రం ఈ విలీన ప్రతిపాదనను పూర్తిగా విద్యార్థి ప్రయోజనాల కోసమేనని చెబుతోంది.
ప్రభుత్వం ఏమి చేయాలి..?
ఈ అంశంలో ఇరు వర్గాల వాదనల్లోనూ వాస్తవం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు తగ్గించడంతోపాటు ఇంటర్ విద్య నాణ్యతా ప్రమాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో.. విద్యావేత్తలతో ప్రభుత్వం చర్చించాలి. క్షేత్రస్థాయిలో పున:పరిశీలించాలి. అకడమిక్ అధ్యయనాలు చేపట్టాలి. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.
ఇంటర్ బోర్డు విలీనం అంశం సాధారణ పరిపాలనా మార్పు కాదు.. ఇది రాాష్ట్ర విద్యా వ్యవస్థ భవిష్యత్తును సమూలంగా మలిచే కీలక నిర్ణయం. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా అమలు చేస్తే.. విద్య అందుబాటులోకి తెచ్చినా.. అకాడమిక్ నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. సరైన ప్రణాళికతో దశలవారీ అమలు చేయడం. అన్ని వర్గాల భాగస్వామ్యం జోడించడం చేస్తే.. ఇది ఉన్నతమైన విద్యా సంస్కరణగా నిలవొచ్చు. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి..: Vijay Thalapathy | దళపతి @ జననేత.. తమిళనాడు రాజకీయాల్లో ‘విజయ్’ శకం మొదలు!

