Iran US Conflict | డేటా సెంటర్లు, అణు కర్మాగారాలే లక్ష్యంగా.. ఇరాన్ – అమెరికా భీకర దాడులు

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరు దేశాలు పరస్పరం విరుచుకుపడుతుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Iran US Conflict | ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరు దేశాలు పరస్పరం విరుచుకుపడుతుండటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా క్షిపణి దాడులు చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) దాడులు కొనసాగిస్తోంది.

Iran US Conflict | అమెజాన్ డేటా సెంటర్‌పై డ్రోన్ దాడి..

సోమవారం రాత్రి జోర్డాన్‌లోని సైనిక, పౌర మౌలిక సదుపాయాలతో పాటు కువైట్, బహ్రెయిన్‌లలోని పౌర విమానాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ దాడులు జరిపింది. ముఖ్యంగా బహ్రెయిన్‌లోని ప్రముఖ టెక్ దిగ్గజం ‘అమెజాన్’ డేటా సెంటర్‌పై ఐఆర్‌జీసీ డ్రోన్లతో దాడి చేసి, అక్కడి మౌలిక వసతులను ధ్వంసం చేసింది. మరోవైపు, జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి వైమానిక స్థావరంపై 24 గంటల వ్యవధిలో మూడుసార్లు క్షిపణి దాడులు జరిగాయి. సైనికులు నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, స్థావరం తీవ్రంగా ధ్వంసమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇరాన్ తీరానికి సమీపంలో మోహరించిన అమెరికా నౌకాదళ ఆస్తులపైనా డ్రోన్లు ప్రయోగించారు.

Iran US Conflict | ఇరాన్ లక్ష్యంగా అమెరికా ప్రతిదాడులు..

ఇరాన్‌లోని రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడుతోంది. బందర్ అబ్బాస్ నగరంలోని ప్రధాన నౌకా కేంద్రం, వాణిజ్య ఓడరేవులపై క్షిపణి దాడులు చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోంజీ ప్రాంతంలోని ఉప్పునీటి శుద్ధి కర్మాగారం ధ్వంసమవడంతో సుమారు 10 వేల మందికి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అలాగే ఇరాన్‌లో పనిచేస్తున్న ఏకైక అణు కర్మాగారం ‘బుషెహర్’ కూడా ఈ దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇది కూడా చదవండి:  Balakrishna Injury | షూటింగ్‌లో బాలకృష్ణకు గాయాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *