అక్షరటుడే వెబ్‌డెస్క్: Jaish Terror Plot | పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్ మోండల్ అనే వ్యక్తిని, అతడికి సహకరించిన యువతిని బెంగాల్ ( Bengal )పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఇటీవల దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనల్లో అల్లర్లు సృష్టించాలని, అలాగే బెంగాల్ ప్రముఖ రాజకీయ నేతను లక్ష్యంగా చేసుకోవాలని నిందితులు ప్రణాళికలు రచించినట్లు గుర్తించామన్నారు. పోలీసు యూనిఫామ్‌లో నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి అల్లర్లు సృష్టించాలని జైషే గ్రూప్ నుంచి హమీమ్‌కు ఆదేశాలు అందాయని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం కొంతమంది మహిళలు, పురుషులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయితే వారు జంతర్‌మంతర్ వద్దకు వెళ్లారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉగ్ర హ్యాండ్లర్‌లతో వారు చేసిన చాట్‌లను పరిశీలిస్తున్నామన్నారు. సువేందు అధికారి ఏ ప్రదేశంలో పోలీసుల బందోబస్తు లేకుండా ఉంటారనే లాంటి వివరాలు సేకరించాలని కూడా వారు నిందితులను ఆదేశించారన్నారు.
Jaish Terror Plot | హనీట్రాప్ వలయం ..
బెంగాల్‌లోని రాజకీయ నేతలకు వలపు వల విసిరేందుకు హమీమ్‌కు సహకరించిన ఝార్ఖండ్ యువతి అర్పిత సర్కార్.. అతడి ప్రియురాలని అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. చిన్నస్థాయి నేతలను పరిచయం చేసుకుని.. వారి ద్వారా ప్రముఖ నేతలపై నిఘా పెట్టడం, తమ వారిని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలుగా నియమించడం వంటి పనులకు హమీమ్ ఆమెను వినియోగించేవాడు. బెంగాల్ మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్‌తో కిడ్నాప్ చేసి, వారి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేయడానికి వీరిద్దరూ కుట్ర పన్నారు. రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో యువతికి సంబంధాలు ఉన్నాయని.. వారి సమాచారాన్ని ఆమె ఎప్పటికప్పుడు హమీమ్‌కు చేరవేసిందని అధికారులు పేర్కొన్నారు.
Jaish Terror Plot | ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు..
నిందితులు ఇద్దరు పలు ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా పాక్ హ్యాండ్లర్‌లతో కొన్నేళ్లుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. యూకే, మెక్సికోలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డ్‌లు వారి వద్ద లభ్యమయ్యాయి. దేశంలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాద నియామకాలు వంటి కార్యకలాపాలకు కూడా హ్యాండ్లర్లు వీరిని ఉపయోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Vizag Beach Tragedy | సముద్రంలో గల్లంతైన యువతి, యువకుడు