అక్షరటుబే వెబ్‌డెస్క్:Suniel Narang Resignation|తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ , ఏషియన్ మల్టీప్లెక్స్‌ల అధినేత సునీల్ నారంగ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. కేవలం కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు పేర్కొంటూ ఆయన ఛాంబర్‌కు అధికారికంగా ఒక ఈమెయిల్ పంపించారు. సునీల్ నారంగ్ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. కాగా, ఈ ఖాళీ అయిన అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయడానికి శుక్రవారం రోజు(ఎల్లుండి) కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఎన్నిక జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
Suniel Narang Resignation|పర్సంటేజీ వివాదమే కారణమా..?
పైకి వ్యక్తిగత కారణాలని చెబుతున్నప్పటికీ, ఇటీవల టాలీవుడ్‌లో థియేటర్ల లీజు వ్యవహారంలో నడుస్తున్న ‘పర్సంటేజీ విధానం’ వివాదమే ఈ రాజీనామాకు దారితీసిందనే టాక్ వినిపిస్తోంది. మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ల కలెక్షన్లపై పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా.. పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ఎగ్జిబిటర్ల తరఫున నిలబడ్డ సునీల్ నారంగ్, అగ్ర నిర్మాతల నుండి గట్టిగా విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ తీవ్రమైన విభేదాలు , ఒత్తిడి వల్లే ఆయన తన పదవిని వదులుకోవడానికి మొగ్గు చూపినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి:Banavasi Brucellosis|కర్నూలు జిల్లాలో ప్రమాదకర ‘బ్రూసెల్లోసిస్’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు పాకిన జబ్బు


