Banavasi Brucellosis|కర్నూలు జిల్లాలో ప్రమాదకర ‘బ్రూసెల్లోసిస్’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు పాకిన జబ్బు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Banavasi Brucellosis | కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలోని ప్రభుత్వ సెమన్ బ్యాంక్​లో ప్రమాదకరమైన ‘బ్రూసెల్లోసిస్’ వ్యాధి బయటపడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ జబ్బు పశువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పనిచేసే ఇద్దరు కూలీలకు కూడా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పశువైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Banavasi Brucellosis | ఎనిమిది పశువులకు పాజిటివ్..

బనవాసి కేంద్రంలో ఉన్న పశువుల ఆరోగ్య పరిస్థితిపై అనుమానంతో అధికారులు ఇటీవల వీటికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం ఎనిమిది పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వ్యాధి మిగిలిన పశువులకు కూడా పాకితే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన అధికారులు.. వెంటనే రంగంలోకి దిగారు. జబ్బు సోకిన ఆ ఎనిమిది పశువులను ప్రధాన వలయం నుంచి వేరు చేసి, బయట ఉన్న ప్రత్యేక షెడ్‌లకు తరలించారు. ప్రస్తుతం వాటికి నిపుణులైన పశువైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు.

Banavasi Brucellosis | కూలీలకు అత్యవసర చికిత్స..

మరోవైపు పశువుల ద్వారా ఈ వ్యాధి బారిన పడ్డ ఇద్దరు కార్మికులను అధికారులు తక్షణమే విధుల నుంచి దూరం పెట్టారు. వారికి ఇతర సిబ్బందితో సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్య నిపుణుల సమక్షంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రంలో పనిచేసే మిగతా సిబ్బందితో పాటు మిగిలిన పశువులకు కూడా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బనవాసి కేంద్రంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: NTR Dragon Glimpse | ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గర్జన మొదలు.. ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన‌ ప్రశాంత్ నీల్!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *