Vizianagaram Incident | విజయనగరంలో షాకింగ్ ఘటన.. భార్యపై పెట్రోల్ దాడికి యత్నం, పోలీస్ స్టేషన్‌లోనే హైడ్రామా!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vizianagaram Incident | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విజయనగరం జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఓ వ్యక్తి పెట్రోల్‌తో దాడికి యత్నించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన షేక్ గౌష్ అనే వ్యక్తికి విజయనగరంలోని ఆబాద్ వీధికి చెందిన మహిళతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి విజయనగరం నగరంలో నివాసం ఉంటున్నారు. గౌష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Vizianagaram Incident | తాగిన మ‌త్తులో..

కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య సమస్యను చట్టపరంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుని మంగళవారం రాత్రి మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న గౌష్‌కు భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిందన్న విషయం తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు పెట్రోల్ సీసాతో మహిళా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం భార్యపై పెట్రోల్ చల్లేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా గౌష్ పోలీసులపైనా పెట్రోల్ విసిరినట్లు సమాచారం. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Vizianagaram Incident | సమయానికి పోలీసులు స్పందించడంతో

సమయానికి పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు ఒకటో పట్టణ ఎస్సై వెల్లడించారు. కుటుంబ వివాదాలు తీవ్ర రూపం దాల్చి ఇలాంటి ప్రమాదకర ఘటనలకు దారితీయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రత, కుటుంబ సమస్యల పరిష్కారంలో సమయానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Matrimonial fraudster arrested | మెడలో తాళి కడతానని.. అకౌంట్ ఖాళీ చేస్తాడు.. మాట్రిమోని కిలాడీ ‘కామేషు’ వేషాలు మామూలుగా లేవుగా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *