అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhogapuram Airport | స్వర్ణాంధ్ర విజన్‌కు నేడు శుభదినమని, రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. “అందరికీ నమస్కారం” అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని.. పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టమన్నారు. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు ఎయిర్, రోడ్ కనెక్టివిటీని మరింత పెంచుతాయని తెలిపారు.
ఈ వేడుకలో భాగంగా తాము రెండు రికార్డులు సృష్టించామని.. మొదటిది భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాగా, రెండోది ఒకేసారి 13 వేల మంది గిరిజనులు థింసా నృత్యం చేయడం అని మోదీ పేర్కొన్నారు. ఇది సీఎం చంద్రబాబు (CM Chandrababu) విజన్‌కు సాక్ష్యమని, ఈ థింసా నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించిందని కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వేగా, లాంచ్‌ప్యాడ్‌గా పనిచేస్తుందని చెప్పారు.
Bhogapuram Airport | విప్లవాత్మక మార్పులు..
గడిచిన పన్నేండేళ్లలో దేశంలో విమానయాన రంగం అసాధారణ పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. 2014 వరకు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 166కు పెరిగిందన్నారు. గతంలో ఎయిర్‌పోర్టులకు ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లు పెట్టేవారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆ విధానం మార్చేశామని చెప్పారు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి, ఇక్కడ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకం ద్వారా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు.
Bhogapuram Airport | కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెట్టింపు వేగంతో దూసుకుపోతోందని ప్రధాని ప్రశంసించారు. ఈ ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తూ, ప్రధాన పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానిస్తున్నామన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రైలు, పోర్టు, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఏపీ యువత దూసుకుపోతోందని, ప్రతిభ గల యువతకు అనేక అవకాశాలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, ఏపీలో బలమైన గ్రోత్ ఎకోసిస్టమ్‌ను నిర్మించబోతున్నామని.. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతోందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
“Under Chandrababu Naidu’s leadership, Andhra will emerge as manufacturing hub.”
– PM Modi in Bhogapuram pic.twitter.com/wAOhMe3okd
— News Arena India (@NewsArenaIndia) August 1, 2026
ఇది కూడా చదవండి..: Pawan Kalyan on Modi | ప్రధాని మోదీ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరం: పవన్ కల్యాణ్