మొబైల్ వినోదంలో సరికొత్త రికార్డు: 100 మిలియన్ల యూజర్ల మార్కును దాటిన జియోహాట్‌స్టార్ ‘తడ్కా’!

Shivam nagarani

భారతదేశ స్ట్రీమింగ్ పరిశ్రమలో సరికొత్త వినోద విప్లవానికి నాంది పలుకుతూ జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా అందుబాటులోకి వచ్చిన ‘తడ్కా’ (TADKA) ఏకంగా 100 మిలియన్ల వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. దీంతో ప్రీమియం మైక్రో-కంటెంట్ అనేది డిజిటల్ వినోద ప్రపంచంలో ఒక ప్రధాన విభాగంగా (Mainstream entertainment category) స్థిరపడింది. సంప్రదాయ సుదీర్ఘమైన కంటెంట్‌తో పాటు మొబైల్‌కు అనుగుణంగా ఉండే షార్ట్-ఫార్మాట్ కథలను వీక్షించేందుకు ప్రేక్షకులు ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో ఈ అద్భుత విజయం ప్రతిబింబిస్తోంది. ఇది లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రతి వీక్షకుడి రోజువారీ వాచ్ టైమ్ (వీక్షణ సమయం) ఏకంగా 5 రెట్లు పెరగడం విశేషం.

యువతరం అండ.. నగరాల్లో సమాన ఆదరణ
తడ్కా (TADKA) పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలు ఇలా ఉన్నాయి:

యువ వీక్షకులు: మొత్తం వీక్షకులలో 42 శాతం కంటే ఎక్కువ మంది 24 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారే కావడం గమనార్హం.

ప్రాంతాల వారీగా: మెట్రో నగరాలు , టైర్ 2 నగరాల నుండి వచ్చే ప్రేక్షకులు మొత్తం వాచ్ టైమ్‌లో చెరో 40 శాతం మేర భాగస్వామ్యాన్ని పంచి ఇస్తున్నారు.

ఈ గణాంకాలు దైనందిన వినోద అలవాట్లకు సరిగ్గా సరిపోయేలా ఉండే ప్రీమియం, మొబైల్-ఫస్ట్ స్టోరీటెల్లింగ్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి.

కేవలం 30-60 సెకన్ల వర్టికల్ ఎపిసోడ్లు.. దేశవ్యాప్త క్రియేటివ్ నెట్‌వర్క్
జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో 100 కంటే ఎక్కువ ఒరిజినల్ టైటిల్స్‌తో లాంచ్ అయిన తడ్కా, రోజువారీ జీవితంలో దొరికే ప్రతి చిన్న ఖాళీ సమయాన్ని వినోదభరితంగా మార్చేలా రూపొందింది. కేవలం 30 నుండి 60 సెకన్ల వ్యవధితో ఉండే నిలువు వరుస (Vertical) ఎపిసోడ్‌ల కథలతో.. పూర్తిగా మొబైల్ వినియోగానికి అనుగుణంగా ఇది నిర్మించబడింది. ఇందులోని కథలు దైనందిన భావోద్వేగాలు, బంధాలు, ఆకాంక్షలు , సమకాలీన భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. హిందీ, తమిళం, తెలుగు , మరికొన్ని భాషలలో లభించే ఈ కంటెంట్‌లో రొమాన్స్, డ్రామా, థ్రిల్లర్స్, కామెడీ, స్పోర్ట్స్, యూత్-సెంట్రిక్ కథలు వంటి విభిన్నమైన జోనర్స్ అందుబాటులో ఉన్నాయి.

మైక్రో-కంటెంట్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో దీని నిర్మాణ రంగం కేవలం సంప్రదాయ వినోద కేంద్రాలకే పరిమితం కాకుండా ముంబై, ఢిల్లీ, లక్నో, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు విస్తరించింది. దీనివల్ల వివిధ రకాల కథలు, వైవిధ్యమైన గొంతుకలు ఒకే చోట చేరి విభిన్నమైన క్రియేటివ్ వ్యవస్థను నిర్మించడంలో తోడ్పడుతున్నాయి.

డిజిటల్ స్ట్రీమింగ్‌లో మైలురాయి
ఈ మైలురాయిని అధిగమించడంపై జియోస్టార్ మైక్రో కంటెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంబుజ్ కశ్యప్ మాట్లాడుతూ.. “100 మిలియన్ల వినియోగదారుల మార్కును దాటడం అనేది డిజిటల్ స్ట్రీమింగ్ పరిణామ క్రమంలో ఒక అతిపెద్ద మలుపును ప్రతిబింబిస్తోంది. వినియోగదారుల ప్రవర్తన ఇప్పుడు సంప్రదాయ వీక్షణ పద్ధతులను దాటి విస్తరిస్తోంది. రోజువారీ జీవితంలో దొరికే ప్రతి చిన్న ఖాళీ సమయంలోనూ వినోదం సహజంగా భాగమయ్యేలా చేసేందుకు ఈ మైక్రో కంటెంట్ కథలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ కొత్త విధానం చిత్ర పరిశ్రమలో సరికొత్త సృజనాత్మకతకు తలుపులు తీస్తుందని మేం బలంగా విశ్వసిస్తున్నాము. ఆకట్టుకునే కథలు, సరికొత్త ప్రొడక్ట్ ఆవిష్కరణలు, వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ల వ్యవస్థ ద్వారా ఈ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపైనే మేం నిరంతరం దృష్టి సారిస్తాం” అని పేర్కొన్నారు.

మారుతున్న వినియోగదారుల ప్రవర్తనకు అనుగుణంగా వినోద అనుభూతులను సరికొత్తగా నిర్మించాలనే జియోహాట్‌స్టార్ విస్తృతమైన వ్యూహంలో తడ్కా (TADKA) కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇంటరాక్టివ్ కామర్స్ , సెకండ్-స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ నుండి ప్రీమియం మైక్రో-కంటెంట్ వరకు.. జియోహాట్‌స్టార్ ప్రేక్షకులు కథలతో కనెక్ట్ అయ్యే విధానాన్ని సరికొత్తగా విస్తరిస్తూ, భారత్‌లో వినోద రంగ తదుపరి అధ్యాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *