అక్షరటుడే వెబ్‌డెస్క్: Kakinada Cancer Treatment | ఉమ్మడి గోదావరి జిల్లాల క్యాన్సర్ రోగులకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో కాకినాడ జీజీహెచ్‌లో సరికొత్త క్యాన్సర్ చికిత్స సదుపాయాల ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవతో ఓఎన్‌జీసీ (ONGC) సీఎస్‌ఆర్ (CSR) నిధులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.
Kakinada Cancer Treatment | కీలక పరిణామాలు ..
ఆగష్టు 3: కాకినాడ జీజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఎంపీ సానా సతీష్ బాబు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఓఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధులతో ఆధునిక రేడియేషన్ థెరపీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆగష్టు 7: క్యాన్సర్ చికిత్స సదుపాయాల ఏర్పాటుకు సీఎస్‌ఆర్ నిధులు అందించేందుకు ముందుకొచ్చిన ఓఎన్‌జీసీ.. కాకినాడ జీజీహెచ్‌కు అధికారిక ఒప్పంద పత్రాన్ని పంపించింది.
ఆగష్టు 12: ఓఎన్‌జీసీ పంపిన ఒప్పందంపై కాకినాడ జీజీహెచ్ అధికారులు సంతకం చేసి తిరిగి పంపించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రక్రియ మరింత ముందుకు వెళ్ళింది.
Kakinada Cancer Treatment | వైద్య సదుపాయాలు..
ఓఎన్‌జీసీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల్లో భాగంగా కాకినాడ, గుంటూరు, కడప ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన క్యాన్సర్ చికిత్స కోసం సుమారు రూ.48 కోట్లను కేటాయించడానికి అంగీకరించింది. ఇందులో ఒక్కో కేంద్రానికి సుమారు రూ.16 కోట్ల చొప్పున కేటాయిస్తున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సీటీ సిమ్యులేటర్ వంటి యంత్ర సామగ్రిని ఓఎన్జీసీ పూర్తిగా సమకూర్చనుంది.
Kakinada Cancer Treatment | భారీ ఊరట..
ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు కాకినాడ జీజీహెచ్‌కు వస్తుంటారు. అయితే క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటివరకు విశాఖపట్నం, హైదరాబాద్ ( Hyderabad )వంటి నగరాలకు వెళ్లాల్సి రావడంతో రోగుల కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఇకపై కాకినాడలోనే ఈ వైద్యం అందుబాటులోకి వస్తే వేలాది మందికి ప్రయోజనం కలగడంతో పాటు, లక్షల రూపాయల వైద్య ఖర్చులు , సుదూర ప్రయాణాల భారం పూర్తిగా తగ్గనుంది.
Kakinada Cancer Treatment | సానా సతీష్ బాబు ప్రత్యేక కృషి..
ఈ ప్రతిపాదన కోసం ఎంపీ సానా సతీష్ బాబు ఢిల్లీలో ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్యాన్సర్ బాధితుల ఇబ్బందులను అధికారులకు వివరించి, నిధులు మంజూరయ్యేలా నిరంతరం కృషి చేశారు. అవసరమైన మౌలిక వసతులు , పరికరాల ఏర్పాటు పూర్తయిన వెంటనే ఈ అత్యాధునిక క్యాన్సర్ చికిత్స సేవలు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి : డీఐజీ సన్‌ప్రీత్ సింగ్