అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Review Meeting | దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ ( జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సీషెల్స్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన వెంటనే, దేశ బ్యూరోక్రసీతో ప్రధాని చేపడుతున్న రెండవ అతిపెద్ద సమీక్ష ఇదే కావడం విశేషం. దేశాభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరగనుంది.
Modi Review Meeting | మూడు కీలక అంశాలు..
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టి సారించనున్నారు. దేశంలో వ్యాపార కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Ease of Doing Business) వాతావరణాన్ని మెరుగుపరచడం మొదటి ప్రాధాన్యత కాగా, సామాన్యుల రోజువారీ జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ (Ease of Living) అంశం రెండవది. ఇక మూడవదిగా, 2047 నాటికి భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలనే ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్యానికి అనుగుణంగా, పరిపాలనా యంత్రాంగంలో అవసరమైన సంస్కరణలను మరింత వేగవంతం చేయడంపై ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Modi Review Meeting | 52 సంస్కరణలు’పై ప్రత్యేక ఫోకస్..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన “52 వారాల్లో 52 సంస్కరణలు” (52 Reforms in 52 Weeks) కార్యక్రమం పురోగతిని ప్రధాని ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. పాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , డిజిటల్ టూల్స్ వినియోగంపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు.
Modi Review Meeting | సమయపాలనకు పెద్దపీట..
సమావేశాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రధాని కఠినమైన నిబంధనలు విధించారు. ప్రతి మంత్రిత్వ శాఖ కార్యదర్శి తమ శాఖలో రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించేందుకు చేపట్టిన చర్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీలు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, కేబినెట్ సెక్రటరీ టి.వి. సోమనాథన్ సహా కీలక ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Indus Water | సింధు జలాలపై పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు