Kartika Pournami Jwala Thoranam | జ్వాలా తోరణం విశిష్టత.. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో ఈ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా?

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపారాధనలు, ప్రత్యేక పూజలతో పాటు 'జ్వాలా తోరణం' అనే విశిష్ట అగ్ని ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kartika Pournami Jwala Thoranam | హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపారాధనలు, ప్రత్యేక పూజలతో పాటు ‘జ్వాలా తోరణం’ అనే విశిష్ట అగ్ని ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం 2026 నవంబర్ 24 (మంగళవారం) కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆలయాల్లో ఈ వేడుక జరగనుంది. శివకేశవులకు ( Shiva ) ప్రీతికరమైన కార్తీకంలో జరిగే ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు తరలివెళ్తారు.

Kartika Pournami Jwala Thoranam | పురాణ కథనాలు..

ఈ అగ్ని ఉత్సవం నిర్వహణ వెనుక ప్రధానంగా రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం.. కార్తీక పౌర్ణమి రోజు  త్రిపురాసురులను సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించిన పరమశివుడికి దిష్టి తగలకుండా పార్వతీదేవి స్వయంగా జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేశారట. మరో కథనం ప్రకారం.. క్షీరసాగర మథనంలో వెలువడిన హాలాహల విషాన్ని లోకకల్యాణం కోసం స్వీకరించి నీలకంఠుడిగా మారిన అనంతరం, శివపార్వతులు జ్వాలా తోరణం గుండా మూడుసార్లు నడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Kartika Pournami Jwala Thoranam | ఉత్సవ నిర్వహణ విధానం..

కార్తీక పౌర్ణమి సాయంత్రం శివాలయ ప్రాంగణంలో రెండు ఎత్తైన కర్రలను పాతి, వాటి పైభాగాలను మరో అడ్డు కర్రతో కలుపుతారు. ఆ అడ్డు కర్రకు ఎండుగడ్డిని చుట్టి నేతితో తడిపి నిప్పంటిస్తారు. మంటలతో ప్రకాశించే ఆ తోరణం కింద నుంచి ముందుగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ మూడుసార్లు దాటిస్తారు. ఆ తర్వాత భక్తులు కూడా భక్తిశ్రద్ధలతో దాని కింద నుంచి నడుస్తారు.

Kartika Pournami Jwala Thoranam | దర్శనం వల్ల కలిగే ఫలితాలు..

జ్వాలా తోరణాన్ని దర్శించుకోవడం, దాని కింద నుంచి వెళ్లడం వల్ల సమస్త పాపాలు నశించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తుల గాఢ విశ్వాసం. ముఖ్యంగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, నరకబాధలు ఉండవని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఉత్సవం ముగిసిన తర్వాత ఆ తోరణం నుంచి రాలిన భస్మాన్ని పవిత్ర విభూతిగా భావించి నుదుటన ధరించే సంప్రదాయం కూడా ఉంది.

ఇది కూడా చదవండి:  Bhogapuram Accident | ట్యాంకర్​ను ఢీకొన్న థార్​ జీపు.. ఐదుగురు మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *