అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaylee Hottle Death | అమెరికాలో యువ నటి కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం సినీ పరిశ్రమతో పాటు అభిమానులను విషాదంలో ముంచెత్తింది. మేరీల్యాండ్‌లో జులై 21 ఉదయం జరిగిన కారు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
అమెరికన్ సంకేత భాష (ASL) ద్వారా నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో కేలీ తండ్రి జోషువా హాటిల్ ఆమె మృతి వార్తను ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రమాదం అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె గుండె ఆగిపోయిందని అధికారుల నుంచి సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
Kaylee Hottle Death | ‘జియా’ పాత్రతో సినీ రంగంలోకి
వర్జీనియాకు చెందిన కేలీ హాటిల్ పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న కుటుంబానికి చెందినవారు. సినిమాల్లోకి రాకముందు వినికిడి లోపంపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు, ప్రకటనల్లో పాల్గొన్నారు. అదే ఆమెకు హాలీవుడ్‌లో అవకాశాన్ని తీసుకువచ్చింది.
2021లో విడుదలైన “Godzilla vs. Kong” చిత్రంలో ‘జియా’ పాత్రతో కేలీ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సంకేత భాష ద్వారా కాంగ్‌తో భావోద్వేగ బంధాన్ని చూపించిన ఆమె నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. అనంతరం “Godzilla x Kong: The New Empire” చిత్రంలో కూడా అదే పాత్రను పోషించి మరింత గుర్తింపు సంపాదించారు.
Kaylee Hottle Death | వినికిడి లోపం ఉన్న కళాకారులకు
సినిమాలతో పాటు వినికిడి లోపం ఉన్న కళాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే అంశంపై కూడా కేలీ చురుకుగా పనిచేశారు. వివిధ కార్యక్రమాలు, ఫ్యాన్ ఈవెంట్లలో పాల్గొంటూ సంకేత భాష ద్వారా అభిమానులతో మమేకమయ్యేవారు. హాలీవుడ్‌లో వినికిడి లోపం ఉన్న నటీనటులకు ప్రాతినిధ్యం పెరగాలనే లక్ష్యంతో ఆమె చేసిన కృషి ప్రశంసలు అందుకుంది.
కారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అలాగే Legendary Pictures, Warner Bros. సంస్థలు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.