అక్షరటుడే వెబ్‌డెస్క్: Khairatabad Bypoll | ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వివాదంపై కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి స్పందించారు. నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను కోర్టులో వేసిన పిటిషన్ కొత్తది కాదని, గతంలో దాఖలు చేసిన పాత కేసే ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని ఆమె స్పష్టం చేశారు. న్యాయస్థానం పరిధిలో నడుస్తున్న విషయాలపై బహిరంగంగా మాట్లాడటం పద్ధతి కాదని, ఈ వివాదంపై దానం నాగేందర్ ( Danam Nagender ) ఏమంటున్నారనేది తనకు అనవసరమని తేల్చిచెప్పారు. ఎన్నికల పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్లే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కూడా స్పష్టం చేసినట్లు ఆమె గుర్తుచేశారు.
Khairatabad Bypoll | పిటిషన్‌కు అసలు కారణం..
గత 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య , డిపెండెంట్ల ఆస్తుల వివరాలను దానం నాగేందర్ దాచిపెట్టారని, అంతేకాకుండా ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 2024 జనవరిలో విజయారెడ్డి హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.
Khairatabad Bypoll | నోటిఫికేషన్‌పై ఉత్కంఠ..
ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడటంతో, అసెంబ్లీ సెక్రటేరియట్ ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాను గతంలో వేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి : Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్