Lok Sabha Sessions | ఏడాదిలో 55 రోజులే పార్లమెంట్ సమావేశాలు.. మిగతా రోజుల్లో ఎంపీలు ఏం చేస్తారు?

చట్టాలు రూపొందించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజా సమస్యలపై చర్చించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించే లోక్‌సభ ఏడాదిలో సగటున కేవలం 55 రోజులే సమావేశమవుతోందనే గణాంకాలు ఆసక్తిని రేపుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Lok Sabha Sessions | చట్టాలు రూపొందించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజా సమస్యలపై చర్చించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించే లోక్‌సభ ఏడాదిలో సగటున కేవలం 55 రోజులే సమావేశమవుతోందనే గణాంకాలు ఆసక్తిని రేపుతున్నాయి. 17వ లోక్‌సభ (2019-24) కాలంలో ఈ సగటు 55 రోజులకు పరిమితమైంది. మిగతా రోజుల్లో సభా కార్యకలాపాలు జరగనప్పటికీ పాలన, ప్రజాప్రతినిధుల పనులు ఇతర మార్గాల్లో కొనసాగుతాయా లేక ప్రజాస్వామ్య చర్చలకు సమయం తగ్గుతోందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

Lok Sabha Sessions | తగ్గుతున్న సమావేశాల సంఖ్య..

లోక్‌సభ సమావేశాల రోజులు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్నాయి. తొలి లోక్‌సభ ఏడాదికి సగటున 135 రోజులు పనిచేయగా, రెండో లోక్‌సభ 116 రోజులు, మూడో లోక్‌సభ 117 రోజులు సమావేశమయ్యాయి. పదో లోక్‌సభ నాటికి ఈ సంఖ్య 93 రోజులకు చేరింది. ఆ తర్వాత 14వ లోక్‌సభ సగటున 66 రోజులు, 15వ లోక్‌సభ 71 రోజులు, 16వ లోక్‌సభ 66 రోజులు సమావేశమయ్యాయి. 2019-24 మధ్య 17వ లోక్‌సభ సగటు 55 రోజులకు పడిపోయింది. 1980ల నుంచే సమావేశాల సంఖ్య ఏడాదికి 100 రోజుల కంటే తక్కువగా ఉంటోంది.

Lok Sabha Sessions | రాష్ట్ర అసెంబ్లీలలోనూ ఇదే పరిస్థితి..

సమావేశాల సంఖ్య తక్కువగా ఉండటం రాష్ట్ర శాసనసభల్లోనూ కనిపిస్తోంది. అధ్యయనాల ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు ఏడాదికి సగటున 26 రోజులు మాత్రమే సమావేశమవుతున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 1950లలో ఏడాదికి సగటున 83 రోజులు పనిచేయగా, 2011-17 మధ్య కాలంలో 24 రోజులకు తగ్గింది.

Lok Sabha Sessions | రాజ్యాంగ నిబంధనలు..

పార్లమెంట్ ( Parliament )ఏడాదికి కచ్చితంగా ఇన్ని రోజులు సమావేశం కావాలని భారత రాజ్యాంగంలో నిర్దిష్ట సంఖ్య లేదు. అయితే ఒక సమావేశానికి, తదుపరి సమావేశానికి మధ్య ఆరు నెలలకు మించి విరామం ఉండకూడదని రాజ్యాంగం పేర్కొంటోంది. 2002 నాటి రాజ్యాంగ సమీక్ష కమిటీ పెద్ద సభలు ఏడాదికి కనీసం 90 రోజులు, చిన్న సభలు కనీసం 50 రోజులు సమావేశం కావాలని సూచించింది. ఏడాదికి కనీసం 100 రోజుల సమావేశాల ప్రతిపాదన రాజ్యసభలో చర్చకు వచ్చినా చట్టంగా మారలేదు.

సమావేశాలు లేని రోజుల్లో జరిగే పనులు..

సభలు వాయిదా పడిన రోజుల్లోనూ పార్లమెంటరీ కమిటీలు తమ పనిని కొనసాగిస్తాయి. బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించడం, నిపుణులు, సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవడం, ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించడం, నివేదికలు రూపొందించడం వంటి బాధ్యతలను ఈ కమిటీలు నిర్వర్తిస్తాయి. మరోవైపు ఎంపీలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం చేస్తుంటారు. ప్రభుత్వ శాఖలు కొత్త చట్టాల ముసాయిదాలు, విధానాల రూపకల్పనలో నిమగ్నమవుతాయి.

Lok Sabha Sessions | ప్రజాస్వామ్య చర్చలపై విశ్లేషణ..

కమిటీలు, నియోజకవర్గాల ద్వారా పనులు జరుగుతున్నాయని, కమిటీల్లో బిల్లులపై లోతైన చర్చకు అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అదే సమయంలో సభా సమావేశాలు తగ్గడం వల్ల బహిరంగ చర్చలు, ప్రశ్నోత్తరాలు, ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గే ప్రమాదం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ప్రజల ముందు నేరుగా సమాధానాలు చెప్పడానికి, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను లేవనెత్తడానికి, చట్టాల్లోని లోపాలను చర్చించి సరిదిద్దడానికి సభ ప్రధాన వేదికగా ఉంటుంది. ఉన్న కొద్దిరోజుల సమావేశాల్లోనే నిరసనలు, వాయిదాలతో అంతరాయాలు ఏర్పడితే చర్చల సమయం మరింత కుచించుకుపోతోంది. ఏడాదికి 55 రోజుల పనిదినాలు ప్రజాస్వామ్యంలో చర్చలు, జవాబుదారీతనంపై ఆలోచింపజేసే అంశంగా నిలుస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  Fish Market Raid | చేపల మార్కెట్​లో టీజీ సేఫ్​ అధికారుల తనిఖీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *