అక్షరటుడే వెబ్‌డెస్క్: Habitat Matters | భారత నిర్మాణ రంగంలో తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే (లో-కార్బన్) నిర్మాణ సామగ్రి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గోద్రెజ్ ప్రాపర్టీస్ (GPL), జైన్టియో (Xynteo) సంస్థలు సంయుక్తంగా ‘హాబిటాట్ మ్యాటర్స్’ (Habitat Matters) అనే నూతన కార్యక్రమాన్ని ప్రకటించాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు చెందిన ‘గుడ్ అండ్ గ్రీన్ లాబ్స్’ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఈ వేదికను ఏర్పాటు చేశారు.
Habitat Matters | ప్రధాన లక్ష్యంగా..
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణ రంగాలు కలిగిన దేశాలలో ఒకటిగా కొనసాగుతోంది. 2050 నాటికి దేశంలో సుమారు 34 బిలియన్ చదరపు మీటర్ల మేర కొత్త భవనాలు నిర్మితమయ్యే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుత నిర్మాణ స్థాయిలు భవిష్యత్తులో దాదాపు రెట్టింపు కానున్నాయి. అయితే, ఈ సమయంలో నిర్మించే ప్రతి భవనం పర్యావరణంపై చూపే ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతుంది. సిమెంట్, కాంక్రీట్, స్టీల్, గ్లాస్ , గోడల నిర్మాణంలో వాడే బ్లాకులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హితమైన నిర్మాణ సామగ్రి వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
Habitat Matters | ‘హాబిటాట్ మ్యాటర్స్’ ఉద్దేశం ..
వాగ్దానాలు చేసే లో-కార్బన్ పదార్థాలకు, వాస్తవ నిర్మాణ రంగంలో వాటి అమలుకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే ‘హాబిటాట్ మ్యాటర్స్’ ప్రధాన ఉద్దేశం. నమ్మకమైన నూతన ఆవిష్కరణలను గుర్తించి, వాటిని లైవ్ ప్రాజెక్ట్‌లపై పరీక్షించి, వాస్తవ పరిస్థితుల్లో వాటి పనితీరును అంచనా వేస్తారు. రాబోయే ఐదేళ్లలో ఇలాంటి ప్రయోగాలను అమలు చేసి, నిర్మాణ రంగానికి మార్గదర్శకంగా నిలిచే పటిష్టమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని గోద్రెజ్ ప్రాపర్టీస్ లక్ష్యంగా పెట్టుకుంది.
Habitat Matters | నూతన ఆవిష్కర్తలకు అద్భుత అవకాశం
ఈ సందర్భంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ చీఫ్ డిజైన్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ రోహిత్ మోహన్ మాట్లాడుతూ.. “భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో సుస్థిరత విషయంలో గోద్రెజ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. వాగ్దానాలకు, క్షేత్రస్థాయి ఆచరణకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే మా లక్ష్యం. దీని ద్వారా నూతన ఆవిష్కర్తలకు ఇంజనీరింగ్ నైపుణ్యం, లైవ్ సైట్లలో వారి సామగ్రిని పరీక్షించే అవకాశం లభిస్తుంది” అని తెలిపారు.
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ‘గుడ్ అండ్ గ్రీన్’ హెడ్ పాక్జాన్ దస్తూర్ మాట్లాడుతూ.. తక్కువ కార్బన్ సామగ్రి అనేది నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని, దీన్ని అందరితో కలిసి పరిష్కరిస్తామని అన్నారు. అలాగే జైన్టియో పార్టనర్ సుమన్ జగదేవ్ మాట్లాడుతూ.. భారత్‌లో ఆవిష్కరణలకు కొదవ లేదని, వాటి అమలులోనే సవాల్ ఉందని, దానికి హాబిటాట్ మ్యాటర్స్ సరైన వారధిగా నిలుస్తుందని చెప్పారు.
Habitat Matters | దరఖాస్తులకు ఆహ్వానం..
ఈ కార్యక్రమం కోసం సంస్థ ‘రిక్వెస్ట్ ఫర్ అప్లికేషన్స్’ (RFA)ను ప్రారంభించింది. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, మెటీరియల్ తయారీదారులు, టెక్నాలజీ ప్రొవైడర్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. సిమెంట్, కాంక్రీట్, స్టీల్, బ్లాక్స్, గ్లాస్ వంటి ఐదు ప్రాధాన్యత రంగాలతో పాటు బయో-బేస్డ్ ప్రత్యామ్నాయాలు దీని పరిధిలోకి వస్తాయి. TRL 5 అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఆవిష్కరణలు అర్హత పొందుతాయి. ఎంపికైన దరఖాస్తుదారులకు లైవ్ ప్రాజెక్ట్‌లలో తమ ఆవిష్కరణలను పరీక్షించుకునే అవకాశం లభించడంతో పాటు సాంకేతిక, వాణిజ్యపరమైన మద్దతు అందుతుంది.
ఇది కూడా చదవండి: CBI Bribery Case | రూ.40 లక్షల లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన జీఎస్టీ అధికారులు