LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG PNG Rules | దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగంలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను ప్రవేశపెడుతోంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ప్రకారం.. ఒకే కుటుంబం ఒకే సమయంలో అటు పైప్‌లైన్ గ్యాస్ (PNG), ఇటు ఎల్పీజీ (LPG) సిలిండర్ కనెక్షన్ రెండింటినీ కలిపి ఉంచుకోవడంపై పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన “ఒక కుటుంబానికి – ఒక కనెక్షన్” విధానాన్ని ఇకపై మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఒకే చిరునామాపై రెండు కనెక్షన్లు ఉన్నట్లు గుర్తిస్తే.. సదరు గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పాటు కనెక్షన్‌ను కూడా రద్దు చేస్తామని చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

LPG PNG Rules | పీఎన్‌జీ వచ్చినా వదలని సిలిండర్లు..

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పైప్‌లైన్ గ్యాస్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, సిలిండర్ల వాడకం ఆశించిన స్థాయిలో తగ్గకపోవడంపై అధికారులు దృష్టి పెట్టారు. గత మార్చి నాటికి సుమారు 6.5 లక్షల కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ, వాస్తవ గ్యాస్ వినియోగం అంచనాల కంటే 18 శాతం తక్కువగా నమోదైంది. చాలామంది పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్నప్పటికీ, బ్యాకప్ కోసం ఎల్పీజీ సిలిండర్లను అలాగే ఉంచుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటివరకు స్వచ్ఛందంగా వదులుకోవాలని చేసిన సూచనలను జనం పట్టించుకోకపోవడంతో, ఇప్పుడు డిజిటల్ డేటాబేస్ ద్వారా రెండు కనెక్షన్లు ఉన్నవారిని సులభంగా గుర్తిస్తున్నారు. అయితే ఈ కనెక్షన్ మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చారు.

png.1

LPG PNG Rules | సిలిండర్ బుకింగ్ గడువు పెంపు..

గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రీఫిల్ లాక్-ఇన్ పీరియడ్‌ను ప్రభుత్వం సవరించింది. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత తదుపరి బుకింగ్‌కు కనీస వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనీస గడువును 45 రోజులుగా నిర్ణయించారు. గృహ వినియోగదారులకు ఏడాదికి లభించే 12 సబ్సిడీ సిలిండర్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు కానీ, అంతకంటే అదనంగా తీసుకునే సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించిన డిపాజిట్, రెగ్యులేటర్, పైపు, ఇన్‌స్టాలేషన్ ఫీజులను కూడా సవరించారు.

lpg.1

 

LPG PNG Rules | వదులుకున్న కనెక్షన్‌ను మళ్లీ పొందే వెసులుబాటు..

ఈ కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. పీఎన్‌జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేసిన వారు.. భవిష్యత్తులో పైప్‌లైన్ గ్యాస్ సదుపాయం లేని ఇతర ప్రాంతాలకు లేదా ఊర్లకు బదిలీ అయి వెళ్లినప్పుడు, తమ పాత ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పుల వల్ల గ్యాస్ సబ్సిడీల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడటమే కాకుండా, పంపిణీ వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *