Baghpat Murder Case | యూపీలో దారుణం.. ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే దారుణ సంఘటన వెలుగుచూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Baghpat Murder Case | ఉత్తరప్రదేశ్  ( Uttar Pradesh )రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే దారుణ సంఘటన వెలుగుచూసింది. పరాయి వ్యక్తితో ఏర్పడిన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ప్రియుడితో కలిసి సొంత భర్తనే అత్యంత దారుణంగా హత్య చేయించింది ఓ మహిళ. పక్కా పథకం ప్రకారం మద్యంలో మత్తుమందు కలిపి భర్త ప్రాణాలు తీయడమే కాకుండా, పోలీసులకు చిక్కకుండా ప్రియుడికి వాట్సాప్ ద్వారా పారిపోయే మార్గాలను సైతం సూచించింది.

Baghpat Murder Case | డెహ్రాడూన్ వెళ్లిపోయి..

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ ప్రాంతానికి చెందిన ప్రమోద్, ఊర్మిళ దంపతులు. వీరి ఇంటికి సంబంధించిన ఒక గదిలో సికిందర్ అనే వ్యక్తి మెకానిక్ షాప్ నడిపేవాడు. ఈ క్రమంలో ఊర్మిళకు, సికిందర్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరచూ హోటళ్లలో కలవడంతో పాటు, సికిందర్ ఆమె ఇంటికి కూడా వస్తుండేవాడు. అయితే ఈ విషయం ఊర్మిళ కుమారుడికి తెలియడంతో సికిందర్ ఇంటికి రావడం మానేశాడు. దీంతో భర్తను వదిలేసి డెహ్రాడూన్ వెళ్లిపోయి ఇద్దరూ కలిసి బతకాలని నిశ్చయించుకున్నారు.

Baghpat Murder Case | అత్యంత దారుణంగా..

తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని ఊర్మిళ ప్లాన్ వేసింది. ఆమె పథకం ప్రకారం ప్రియుడు సికిందర్.. ప్రమోద్‌కు మద్యం ఆశ చూపించి పొలం వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే ఊర్మిళ సూచనతో మద్యంలో మత్తుమందు కలిపి ఉంచిన సికిందర్, దానిని ప్రమోద్‌తో తాగించాడు. స్పృహ తప్పి పడిపోగానే మద్యం బాటిల్‌తో తలపై తీవ్రంగా కొట్టి ప్రమోద్‌ను అక్కడికక్కడే హత్య చేశాడు.

Baghpat Murder Case | వాట్సాప్‌లో స్కెచ్..

ఈ హత్య జరుగుతున్న సమయంలో ఊర్మిళ ఎప్పటికప్పుడు ప్రియుడితో వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయి ఉంది. గ్రామంలోని సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో, హత్య అనంతరం ఎటు పారిపోవాలో కూడా ప్రియుడికి వాట్సాప్‌లో సూచనలు ఇచ్చింది. అయితే పొలంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భార్య ఊర్మిళ ప్రవర్తనపై అనుమానం రాగా, ఆమెను లోతుగా ప్రశ్నించడంతో అసలు నిజం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియుడు సికిందర్‌తో పాటు ఊర్మిళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Gujarat Drug Seizure | గుజరాత్​లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *