అక్షరటుడే వెబ్‌డెస్క్: Trump Iran Ceasefire | ఇరాన్, అమెరికా ( US )మధ్య నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. ఇరాన్‌తో పూర్తిస్థాయి కొత్త అణు ఒప్పందం కుదరకపోయినా, యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇందుకోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా పునఃప్రారంభిస్తే చాలు అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ జలసంధి ద్వారా అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించడమే ప్రాతిపదికగా.. సైనిక దాడిని నిలిపివేసి, కాల్పుల విరమణను పొడిగించేందుకు ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు అమెరికా అధికారులు వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.
Trump Iran Ceasefire | మధ్యంతర ఎన్నికల కోసమే ఈ ఆలోచన?
అమెరికాలలో రానున్న మధ్యంతర ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరగకుండా ట్రంప్ ఈ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై ఇంతకాలం సాగించిన యుద్ధం ద్వారా ఏం సాధించామో ఓటర్లకు ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఎలాంటి సంబంధం లేని ఇరాన్‌తో యుద్ధానికి దిగి దేశ సైనిక సంపదను నాశనం చేస్తున్నారంటూ అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసి, క్షిపణి, డ్రోన్ దాడులతో నౌకల రాకపోకలను అడ్డుకుంటోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు తీవ్ర విఘాతం కలగడంతో పాటు, అమెరికాలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకే ట్రంప్ యుద్ధ విరమణ ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Trump Iran Ceasefire | ఇరాన్ కఠిన నిబంధనలు..
ట్రంప్ ఆలోచన ఇలా ఉంటే, జలసంధిని మళ్లీ తెరిచేందుకు ఇరాన్ కొన్ని కీలక డిమాండ్లను అమెరికా ముందుంచుతోంది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించి, నౌకా దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా, గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని షరతులు విధిస్తోంది.
ఇది కూడా చదవండి: Har Ghar Tiranga Kamareddy | స్వాతంత్య్ర సమరయోధుల స్మరణ కోసమే ‘హర్ ఘర్ తిరంగా’