అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mega Job Mela | యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లోని శ్రీరామ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Mega Job Mela | 60కి పైగా కంపెనీలు..
ఇందులో 60కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని ఎమ్మెల్యే (MLA Dhanpal) తెలిపారు. 2 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ యువతలో ఎంతో ప్రతిభ ఉందని, వారికి సరైన మార్గదర్శనం అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
Mega Job Mela | ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు
ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రముఖ కంపెనీలను నేరుగా ఇందూరుకు తీసుకురావడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ధన్పాల్ చెప్పారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి బయోడేటా విద్యార్హతల ధృవపత్రాల ప్రతులు, ఆధార్ కార్డు పాస్పోర్టు సైజు ఫొటోలతో ఉదయం 9 గంటల నుంచి హాజరుకావాలని కోరారు. అలాగే జాబ్ మేళాకు సహకరిస్తున్న కంపెనీలు, వలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో