అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fake Clinics | ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై (Public Health) తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TGMC Inspections) ఉక్కుపాదం మోపింది. పట్టణంలో పలు వైద్యశాలలను అధికారులు గురువారం తనిఖీ చేశారు.
Kamareddy Fake Clinics | రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా..
రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నకిలీ వైద్యులు, అనధికార క్లినిక్లపై తనిఖీలను ముమ్మరం చేసిన కౌన్సిల్, గురువారం కామారెడ్డి టౌన్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. టీజీఎంసీ ఛైర్మన్ డాక్టర్ కె. మహేష్ కుమార్, వైస్ ఛైర్మన్ డాక్టర్ టి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో నాలుగు అనధికార ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పాత బస్స్టాండ్ ప్రాంతంలోని పాపులర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎండీ గులాం దస్తగిరి, శాంతి టాకీస్ దగ్గర నరేష్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు నరేష్, శాంతి టాకీస్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకుడు ఎం. శ్రీనివాస్, సిరిసిల్ల రోడ్డులోని శ్రీ సైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. శివాజీ రావులు అర్హత లేకున్నా వైద్యం చేస్తుండడాన్ని గుర్తించారు. ఎలాంటి ఎంబీబీఎస్ అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తూ, రోగులకు ఇష్టానుసారంగా ఇంజెక్షన్లు, యాంటీబయోటిక్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Kamareddy Fake Clinics | నిబంధనలకు విరుద్ధంగా..
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లు నిర్వహిస్తూ, అధిక మోతాదులో మందులు వాడటం వల్ల రోగుల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని కౌన్సిల్ పేర్కొంది. ఈ నకిలీ వైద్యులపై టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22, జాతీయ వైద్య కమిషన్ చట్టం సెక్షన్ 34, 54 ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఛైర్మన్ మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనర్హులు వైద్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనర్హులైన నకిలీ వైద్యులను ఆశ్రయించి ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని, అర్హత కలిగిన వైద్యుల వద్దే చికిత్స పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతంలో ఎవరైనా నకిలీ వైద్యులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే టీజీఎంసీ అధికారిక వాట్సాప్ నంబర్ 9154382828 కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇండియాలో తగ్గుతున్న జననాలు.. మరో సంక్షోభం తప్పదా?