అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minimum Balance Charges | బ్యాంకులు కస్టమర్లకు సేవలు అందిస్తున్నందుకుగాను చార్జీలు వసూలు చేస్తుంటాయి. అకౌంట్ ఓపెనింగ్, ఏటీఎం కార్డు వార్షిక రుసుము, చెక్ బుక్ చార్జీ.. ఇలా పలు చార్జీలు ఉంటాయి. కొన్ని బ్యాంకుల ఖాతాలకు రకాన్ని బట్టి కనీస సగటు నిల్వ తప్పనిసరి. ఇలా నిల్వ ఉంచకపోతే భారీగా చార్జీలు వసూలు చేస్తాయి. సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో నిర్ణయించిన కనీస సగటు నిల్వ (మినిమం యావరేజ్ బ్యాలెన్స్) నిర్వహించని ఖాతాదారుల నుంచి ఈ చార్జీలు వసూలు చేస్తారు.
Minimum Balance Charges | 2025-26 ఆర్థిక సంవత్సరంలో..
ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలనూ అందుబాటులో ఉంచినా.. కొన్ని బ్యాంకులు, ప్రత్యేక ఖాతాలకు మాత్రం మినిమం యావరేజ్ బ్యాలెన్స్ తప్పనిసరి. ఈ చార్జీలు గ్రామీణ, పట్టణ, మెట్రో నగరాల్లో వేరువేరుగా ఉంటాయి. మినిమం యావరేజ్ బ్యాలెన్స్(ఎంఏబీ) నిర్వహించనందుకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకులు కలిపి రూ. 7 వేల కోట్లకుపైనే చార్జీలు వసూలు చేశాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా రూ. 4,948.71 కోట్లు కాగా ప్రభుత్వ బ్యాంకులది రూ. 2,137.92 కోట్లు.
Minimum Balance Charges | వసూళ్లలో నంబర్ వన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) అత్యధికంగా రూ. 1,798.14 కోట్ల ఎంఏబీ వసూలు చేయడం గమనార్హం. తర్వాతి స్థానంలో రూ. 1081.33 కోట్లతో యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 353.50 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 290.65 కోట్లు, ఎస్ బ్యాంక్ రూ. రూ. 195.05 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 177.92 కోట్లు, ఐడీబీఐ రూ. 175.15 కోట్లు వసూలు చేశాయి.
Minimum Balance Charges | ప్రభుత్వ రంగంలో..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ రూ. 477.27 కోట్ల ఎంఏబీ వసూలు చేసింది. అయితే ఈ మొత్తం సేవింగ్స్ అకౌంట్లనుంచి కాకుండా కరెంట్ అకౌంట్లనుంచి వసూలు చేసింది. సేవింగ్స్ అకౌంట్లపై ఎస్బీఐ 2020 నుంచే ఎంఏబీ చార్జీ రద్దు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 394.10 కోట్లు, ఇండియన్ బ్యాంకు రూ. 299.17 కోట్లు, కెనరా బ్యాంకు రూ. 213.48 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 206.68 కోట్లు ఎంఏబీ చార్జీ వసూలు చేశాయి.
ఇది కూడా చదవండి..: NEET Paper Leak Case | నీట్ పేపర్ లీక్ కేసులో కీలక ముందడుగు..13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్